కేంద్ర పథకాల ప్రయోజనాలు అర్హులైన వారికి అందాలి
కేంద్ర పథకాల ప్రయోజనాలు అర్హులైన వారికి అందాలి: ఎంపీ కడియం కావ్య
ఎంపీ ల్యాడ్స్ పనులు మూడు నెలల్లో ప్రారంభించకపోతే రద్దు చేయాలి
జనగామ | Ntoday News
జనగామ కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ (దిశా) కమిటీ సమావేశంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు అవసరమైన ప్రతిపాదనలను వెంటనే సిద్ధం చేసి, అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఎంపీ అధికారులను ఆదేశించారు. ప్రజలకు అందాల్సిన సంక్షేమ ఫలాలు ఎలాంటి జాప్యం లేకుండా చేరేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఎంపీ ల్యాడ్స్ నిధులతో మంజూరైన అభివృద్ధి పనులను నిర్ణీత సమయంలో ప్రారంభించాలని కడియం కావ్య సూచించారు. మూడు నెలల్లో పనులు ప్రారంభించని పక్షంలో మంజూరైన పనులను రద్దు చేయాలని అధికారులను ఆదేశించారు.
అలాగే మంజూరైన నిధుల వినియోగం, పనుల పురోగతికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు సంబంధిత పోర్టల్‌లో అప్‌డేట్ చేయాలని సూచించారు. అభివృద్ధి పనుల అమలును అధికారులు నిరంతరం పర్యవేక్షించి, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందేలా చర్యలు తీసుకోవాలని ఎంపీ పేర్కొన్నారు.