ప్రజల పక్షాన పనిచేసే జర్నలిజం అవసరం
ప్రజల పక్షాన పనిచేసే జర్నలిజం అవసరం : మీడియా అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాసరెడ్డి
NTODAY NEWS : నల్గొండ,
ప్రజల పక్షాన పనిచేసే జర్నలిజం వ్యవస్థ అవసరమని రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాసరెడ్డి అన్నారు. జర్నలిస్టులు వృత్తి గౌరవాన్ని కాపాడేలా బాధ్యతాయుతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), సామాజిక మాధ్యమాలపై నిర్వహించిన ఒకరోజు వర్క్‌షాప్‌కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకుని మెరుగైన జర్నలిజాన్ని ప్రజలకు అందించడంతో పాటు, జర్నలిస్టులు తమ వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఏఐ, సోషల్ మీడియా ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నల్గొండ డివిజన్ పరిధిలోని జర్నలిస్టుల కోసం ఈ వర్క్‌షాప్ నిర్వహించినట్లు తెలిపారు. అక్టోబర్ 12న నాగార్జునసాగర్‌లో పరిసర ప్రాంతాల జర్నలిస్టులకు ఏఐ, సామాజిక మాధ్యమాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
జర్నలిజంలో ప్రస్తుతం ఏఐ, సోషల్ మీడియా ప్రభావం గణనీయంగా పెరిగిందని, వాటిని సక్రమంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పత్రికా స్వేచ్ఛ, ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్, డిజిటల్ మీడియా విస్తృతార్థాలు, వర్కింగ్ జర్నలిస్ట్, జర్నలిస్టులు తెలుసుకోవాల్సిన ప్రధాన చట్టాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. శిక్షణ సహాయ కలెక్టర్ ఎన్. శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఏఐ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి పౌరుడు జర్నలిస్టులా వ్యవహరిస్తున్న పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇలాంటి సమయంలో వార్తల్లో నిజం, అబద్ధాన్ని గుర్తించి ప్రజలకు వాస్తవ సమాచారాన్ని అందించడం జర్నలిస్టుల బాధ్యత అన్నారు. స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి మాట్లాడుతూ ఏఐతో మంచి ప్రయోజనాలతో పాటు ప్రతికూల ప్రభావాలు కూడా ఉండే అవకాశం ఉందన్నారు. ఏఐ సద్వినియోగం అయ్యేలా జర్నలిస్టులు కృషి చేయాలని, నిరాధార వార్తలకు దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో టైమ్స్ ఆఫ్ ఇండియా ఎడిటర్ (ఇన్వెస్టిగేషన్) ఉడుముల సుధాకర్ రెడ్డి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై, నరసింహస్వామి సోషల్ మీడియాపై జర్నలిస్టులకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నల్గొండ ఆర్డీఓ వై. అశోక్ రెడ్డి, జిల్లా సమాచార శాఖ సహాయ సంచాలకులు యు. వెంకటేశ్వర్లు, జర్నలిస్టు యూనియన్ అధ్యక్షులు కృష్ణారెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్ ఓఎస్డీ రహమాన్, పీఆర్వో శైలేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.