ఎంపీ నిధులతో అన్నారంలో 3 హైమాక్స్ లైట్లు ప్రారంభం..
డొంకేశ్వర్ : మండలంలోని అన్నారం గ్రామంలో రాత్రి వేళల్లో చీకటి ఇబ్బందులను తొలగించేందుకు ఎంపి నిధులతో నూతనంగా ఏర్పాటు చేసిన 3 హైమాక్స్ (హైమాస్ట్) లైట్లను గ్రామ సర్పంచ్ సంజీవ్ చేతుల మీదుగా ప్రారంభించారు. గ్రామంలోని ప్రధాన కూడళ్ల వద్ద కొబ్బరికాయ కొట్టి, పూజా కార్యక్రమాలు నిర్వహించి వీటిని ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు.
ఈ సందర్భంగా సర్పంచ్ సంజీవ్ మరియు మండల అధ్యక్షులు మగ్గిడి చిన్నారెడ్డి మాట్లాడుతూ.. గ్రామంలోని ముఖ్య కూడళ్లలో రాత్రి వేళల్లో సరైన వెలుతురు లేక ప్రజలు, వాహనదారులు, ముఖ్యంగా మహిళలు పడుతున్న ఇబ్బందులను ఎంపీ ధర్మపురి అర్వింద్ దృష్టికి తీసుకెళ్లగా, వారు సానుకూలంగా స్పందించి తక్షణమే ఎంపీ నిధుల నుండి వీటిని మంజూరు చేశారని తెలిపారు. ఈ హైమాక్స్ లైట్ల ఏర్పాటుతో అన్నారం గ్రామంలో ప్రధాన రహదారులు కాంతులీనుతున్నాయని, గ్రామాభివృద్ధికి సహకరించిన ఎంపీకి గ్రామస్తుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మగ్గిడి చిన్నారెడ్డి, బూత్ అధ్యక్షులు వంశీ, ముఖ్య నాయకులు, గ్రామ పెద్దలు, వార్డు సభ్యులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.