భారత్ పైలట్ స్మిత్ మచ్ఛర్‌కు UAE అరుదైన గౌరవం
ఫ్లై దుబాయ్ సిబ్బందికి ‘ఆర్డర్ ఆఫ్ జాయెద్ II’ పురస్కారం
కాక్‌పిట్‌లో దాడి సమయంలో ధైర్యసాహసాలు ప్రదర్శించినందుకు గౌరవం
దుబాయ్: కాక్‌పిట్‌లో దాడి జరిగిన సమయంలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన ఫ్లై దుబాయ్ సిబ్బందికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం ప్రత్యేక గౌరవాన్ని అందించింది. యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌తో పాటు ఫ్లై దుబాయ్ సిబ్బందికి ‘ఫస్ట్ క్లాస్ ఆర్డర్ ఆఫ్ జాయెద్ II’ పురస్కారాన్ని ప్రదానం చేశారు.
విధి నిర్వహణలో చూపిన ధైర్యం, బాధ్యతాయుతమైన ప్రవర్తనకు గుర్తింపుగా ఈ పురస్కారం అందించినట్లు సమాచారం. విమాన భద్రతకు సంబంధించిన క్లిష్ట పరిస్థితుల్లో సిబ్బంది ప్రదర్శించిన తెగువను ఈ సందర్భంగా గుర్తించారు.
దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఈ పురస్కారాన్ని సిబ్బందికి అందజేశారు.