హైదరాబాద్‌లో 49 మంది విదేశీయుల వీసా ఉల్లంఘనలు....
హైదరాబాద్‌లో 49 మంది విదేశీయుల వీసా ఉల్లంఘనలు.. అక్రమ కార్యకలాపాల గుట్టురట్టు
వీసా గడువు ముగిసినా భారత్‌లో ఉంటున్న లేదా వీసా నిబంధనలు ఉల్లంఘించిన 49 మంది విదేశీయులను హైదరాబాద్ పోలీసులు గుర్తించారు. వీరిలో 12 మందిని ఇప్పటికే స్వదేశాలకు పంపించారు.
స్పెషల్ బ్రాంచ్, ఎఫ్‌ఆర్‌ఆర్‌వో, స్థానిక పోలీసులు చేపట్టిన తనిఖీల్లో ఒకరి నుంచి 250 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మరో వ్యక్తి వద్ద దగ్గు మందులో కలిపిన అల్ప్రాజోలం టాబ్లెట్లు గుర్తించారు.
రాజేంద్రనగర్‌లో ముగ్గురు దక్షిణ సూడాన్ దేశస్థులకు నిర్వహించిన డ్రగ్ టెస్టుల్లో గంజాయి పాజిటివ్‌గా తేలినట్లు పోలీసులు వెల్లడించారు. నకిలీ కరెన్సీ, మోసం కేసుల్లోనూ కొందరి ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు.
స్టూడెంట్ వీసా గడువు ముగిసినా కొందరు ఆస్పత్రుల్లో విదేశీ రోగులకు ట్రాన్స్‌లేటర్లుగా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆస్పత్రి బిల్లుల్లో సుమారు 15 శాతం వరకు కమిషన్ తీసుకున్న సందర్భాలు ఉన్నట్లు వెల్లడించారు. టూరిస్ట్ వీసాపై వచ్చిన కెన్యా మహిళ వ్యభిచారంలో పాల్గొన్నట్లు గుర్తించారు.
అత్యధికంగా టోలిచౌకిలో 30 మంది, లంగర్‌హౌస్, మెహిదీపట్నంలో ఆరుగురు చొప్పున గుర్తించారు. విదేశీయులకు వసతి ఇచ్చే యజమానులు, హోటళ్లు పాస్‌పోర్ట్, వీసా వివరాలు తప్పనిసరిగా తనిఖీ చేయాలని పోలీసులు సూచించారు