భారీగా తరలివచ్చిన వైకాపా శ్రేణులు.. భావోద్వేగానికి గురైన బొత్స
విజయనగరం: వైకాపా జిల్లా విస్తృతస్థాయి సమావేశానికి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు నిర్వహించిన ఈ సమావేశానికి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వైకాపా ముఖ్య నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు.
సమావేశంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతున్న సమయంలో వైకాపా నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఒక్కసారిగా భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. బొత్స మేనల్లుడు చిన్న శ్రీను ఇటీవల తెదేపాలో చేరిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
బొత్స భావోద్వేగానికి గురికావడంతో నాయకులు, కార్యకర్తలు ఆయనను ఓదార్చారు. భారీగా తరలివచ్చిన కార్యకర్తలతో సమావేశ ప్రాంగణం సందడిగా మారగా.. బొత్స కంటతడి పెట్టిన ఘటనతో కొద్దిసేపు భావోద్వేగ వాతావరణం నెలకొంది.