హైదరాబాద్: గణేశ్ ఉత్సవాలపై నిరంతర పర్యవేక్షణ
గణేశ్ ఉత్సవాలు ముగిసే వరకు మున్సిపల్, పోలీసు శాఖలు సమన్వయంతో నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉత్సవాల పర్యవేక్షణ, సమన్వయం కోసం ప్రత్యేక అధికారులను నియమించాలని సూచించారు. శాసనసభ ఆవరణలోని మండలి సమావేశ మందిరంలో హైదరాబాద్ మహానగరంలో గణేశ్ ఉత్సవాల ఏర్పాట్లపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, మహమ్మద్ అజారుద్దీన్, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, నగర ప్రజాప్రతినిధులు, జీహెచ్ఎంసీ, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్, హైడ్రా కమిషనర్లు, పోలీసు ఉన్నతాధికారులు, గణేశ్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. గణేశ్ ఉత్సవాల పర్యవేక్షణ కోసం కమాండ్ కంట్రోల్ కేంద్రంలో ప్రత్యేక నియంత్రణ గది ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. హైదరాబాద్ నగరం ప్రశాంతంగా ఉన్నప్పుడే పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుందని, శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. గణేశ్ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలు సజావుగా నిర్వహించేందుకు నిర్వాహకులు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఉత్సవాలకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గణేశ్ ఉత్సవాలకు సంబంధించి గత సంప్రదాయాన్ని పునరుద్ధరించామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఉత్సవ నిర్వాహకుల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకే తాను సమీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గణేశ్ మండపాలకు ప్రముఖులు, అతిథులను ఆహ్వానించినప్పుడు ఆ వివరాలను నిర్వాహకులు స్థానిక పోలీసు కమిషనరేట్‌కు ముందుగానే అందించాలని సూచించారు. దీనివల్ల అవసరమైన ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవడంతో పాటు అనుకోని పరిణామాలు ఎదురైనప్పుడు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టేందుకు వీలవుతుందని తెలిపారు. దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణలో గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. అయితే మండపాల నిర్వాహకులు సంబంధిత అధికారులకు దరఖాస్తు చేసుకుని ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని పొందాలని సూచించారు. ఎక్కడెక్కడ గణేశ్ మండపాలు ఏర్పాటు చేస్తున్నారనే సమాచారాన్ని ముందుగానే పోలీసులకు అందిస్తే రాకపోకల నియంత్రణ, బందోబస్తు నిర్వహణ మరింత సులభతరం అవుతుందని అన్నారు. అభివృద్ధి చేస్తున్న చెరువుల వద్ద బతుకమ్మ కార్యక్రమాలకు ఏర్పాట్లు చేస్తున్న విధంగానే గణేశ్ నిమజ్జనాలకు అనుగుణంగా నిర్మాణ దశలోనే అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. నిమజ్జన ప్రక్రియ సజావుగా సాగేందుకు చెరువుల చుట్టూ క్రేన్లు ఏర్పాటు చేయడానికి అనువుగా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఉత్సవాలు పూర్తయ్యే వరకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.