ప్రముఖ కవి సుద్దాల అశోక్‌తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారం
కరీంనగర్ జిల్లా, సెప్టెంబర్ 12: ప్రముఖ కవి, జాతీయ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారం దక్కనుంది. తెలుగు భాష సంరక్షణ సంఘం, తెలంగాణ సాహితి సంస్థ సంయుక్తంగా ఏటా అందించే రాష్ట్రస్థాయి బుర్ర నర్సమ్మ–లింగారెడ్డి స్మారక తెలంగాణ తెలుగు తేజం సాహిత్య పురస్కారం–2026కు సుద్దాల అశోక్‌తేజ ఎంపికయ్యారు.
ఈ విషయాన్ని పురస్కార కమిటీ చైర్మన్, పురస్కార వ్యవస్థాపకులు కెప్టెన్ డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి, సంఘం రాష్ట్ర అధ్యక్షులు ధ్యాసం సేనాధిపతి శుక్రవారం సాయంత్రం ప్రకటించారు. తెలుగు భాష, సాహిత్యానికి తెలంగాణ మట్టి బిడ్డలు అందించిన విశిష్ట సేవలను గుర్తించి ఈ పురస్కారాన్ని అందిస్తున్నట్లు వారు తెలిపారు.
పురస్కార ప్రధానోత్సవాన్ని ఈ నెల 22న కరీంనగర్ పట్టణంలో ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. తెలుగు భాషా సాహిత్య రంగానికి సుద్దాల అశోక్‌తేజ అందించిన సేవలకు గుర్తింపుగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు.