ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించండి మహాప్రభో శిథిలావస్థలో పాత అంగన్వాడీ భవనం..
ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించండి మహాప్రభో శిథిలావస్థలో పాత అంగన్వాడీ భవనం.. కాలనీ వాసుల్లో భయాందోళన
తిరువూరు: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరు రాజుపేట సీతామహాలక్ష్మీ కాలనీలో సొసైటీ సమీపంలో ఉన్న పాత ఐసీడీఎస్ అంగన్వాడీ భవనం శిథిలావస్థకు చేరి నిరుపయోగంగా మారింది. భవనానికి ఎలాంటి మరమ్మతులు చేపట్టకుండా వదిలేయడంతో పరిసర ప్రాంతమంతా చెట్లు, పిచ్చిమొక్కలతో నిండిపోయి అడవిని తలపిస్తోంది.
భవనం చుట్టూ పిచ్చిమొక్కలు పెరగడంతో విషసర్పాలు, పందులు, కుక్కలకు ఆ ప్రాంతం ఆవాసంగా మారిందని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాములు, కోతులు సమీపంలోని ఇళ్లలోకి చొరబడుతుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని తెలిపారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
ఇదే పరిస్థితి కొనసాగితే శిథిలమైన భవనం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారే ప్రమాదం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తిని ఇలా నిర్లక్ష్యంగా వదిలేయడం వల్ల భవనం పూర్తిగా దెబ్బతినే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.
ఈ సమస్యపై ఇప్పటికే పలుమార్లు ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకునే నాథుడే కరువయ్యారని కాలనీ వాసులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పాత అంగన్వాడీ భవనం పరిస్థితిని పరిశీలించి, పిచ్చిమొక్కలు తొలగించి పరిసరాలను శుభ్రం చేయడంతో పాటు భవనానికి మరమ్మతులు చేయడం లేదా ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
ప్రభుత్వ ఆస్తులు పాడైపోయే వరకు నిర్లక్ష్యం చేయకుండా అధికారులు వెంటనే చర్యలు తీసుకుని కాలనీ వాసుల భయాందోళనలను తొలగించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.