వినాయక మండపాల్లో విద్యుత్ ప్రమాదాలకు తావివ్వొద్దు గ్రామీణ ప్రాంతాల్లో 3, పట్టణ ప్రాంతాల్లో 5 కిలోవాట్ల వరకు ఉచిత విద్యుత్ ఏపీఎస్పీడీసీఎల్ సిఎండీ
తిరుపతి: వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసే వినాయక మండపాల్లో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా నిర్వాహకులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీఎస్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ప్రకటన విడుదల చేశారు.
వినాయక మండపాల్లో విద్యుత్ అలంకరణలు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మండపాలను విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలకు నిర్ణీత దూరంలో ఏర్పాటు చేయాలని, మండపాల మీదుగా విద్యుత్ తీగలు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
విద్యుత్ దీపాలతో అలంకరణ చేసే సమయంలో నాణ్యమైన విద్యుత్ పరికరాలను మాత్రమే వినియోగించాలని, అలంకరణ పనులను అర్హత కలిగిన ఎలక్ట్రిషియన్లతోనే చేయించాలని సూచించారు. అధిక వాటేజీ విద్యుత్ దీపాలను ఉపయోగించే మండపాల వద్ద తగిన సామర్థ్యం కలిగిన వైరింగ్, నాణ్యమైన విద్యుత్ పరికరాలను ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు.
వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామీణ ప్రాంతాల్లో మూడు కిలోవాట్ల వరకు, పట్టణ ప్రాంతాల్లో ఐదు కిలోవాట్ల వరకు విద్యుత్ లోడ్ కలిగిన వినాయక మండపాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తామని సిఎండి తెలిపారు. అంతకుమించిన లోడ్ ఉన్న మండపాల నిర్వాహకులు నిబంధనల ప్రకారం రుసుము చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు.
వినాయక మండపాలకు తాత్కాలిక విద్యుత్ కనెక్షన్ కోసం నిర్వాహకులు తమ సమీపంలోని సహాయ కార్యనిర్వాహక ఇంజనీర్ కార్యాలయాన్ని సంప్రదించి కనెక్షన్ పొందాలని సూచించారు.
వర్షాలు కురిసే సమయంలో విద్యుత్ పరికరాలు తడవకుండా తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని తెలిపారు. వర్షానికి తడిసిన విద్యుత్ పరికరాలను చేతితో తాకరాదని హెచ్చరించారు. విద్యుత్ తీగలు తెగిపడటం లేదా వేలాడుతూ కనిపిస్తే వాటికి దూరంగా ఉండాలని, వెంటనే సమీపంలోని విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బందికి సమాచారం ఇవ్వాలని సూచించారు. అత్యవసర సమాచారం కోసం 1912 టోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్ చేయాలని కోరారు.
వినాయక నిమజ్జనం ఊరేగింపుల సమయంలో కూడా విద్యుత్ లైన్ల కిందుగా వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ శాఖ సిబ్బంది సహకారంతోనే విద్యుత్ లైన్లను దాటాలని సూచించారు.
వినాయక చవితి సందర్భంగా మండపాల నిర్వాహకులకు విద్యుత్ ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించాలని ఆయా సర్కిళ్ల సూపరింటెండింగ్ ఇంజనీర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు శివశంకర్ లోతేటి తెలిపారు. వినాయక చవితి పండుగను భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో పాటు పూర్తిగా సురక్షితంగా జరుపుకోవాలని ఆయన కోరారు.