మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయమే లక్ష్యం: దద్దాల నారాయణ యాదవ్
కనిగిరి: రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని కనిగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జి దద్దాల నారాయణ యాదవ్ పిలుపునిచ్చారు. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు అండగా ఉంటానని, అక్రమ కేసులకు భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.
కనిగిరిలోని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ కార్యాలయంలో సోమవారం మున్సిపాలిటీలోని 32 వార్డులకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలతో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దద్దాల నారాయణ యాదవ్ మాట్లాడుతూ వ్యక్తిగత అభిప్రాయాలు, విభేదాలను పక్కనపెట్టి పార్టీ విజయమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు.
ప్రతి వార్డులో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కార్యాచరణ రూపొందించుకోవాలని, క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుంటూ మద్దతు కూడగట్టాలని అన్నారు. వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారైన తర్వాత అభ్యర్థుల ఎంపికకు అనుగుణంగా పార్టీ శ్రేణులంతా ఐక్యంగా పనిచేయాలని సూచించారు. అభ్యర్థి ఎవరనే దానికంటే పార్టీ విజయం ముఖ్యమని, పార్టీ నిర్ణయించిన అభ్యర్థి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, ప్రజలకు చేసిన మేలును విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని దద్దాల నారాయణ యాదవ్ అన్నారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, అభ్యున్నతి కోసం తమ పార్టీ నిరంతరం పనిచేసిందని పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలతో పాటు ఇతర సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ హామీల అమలులోని లోపాలను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
అధికార పార్టీ నుంచి ఎదురయ్యే ప్రలోభాలు, బెదిరింపులకు కార్యకర్తలు వెనుకడుగు వేయవద్దని, అక్రమ కేసులకు భయపడాల్సిన అవసరం లేదని దద్దాల నారాయణ యాదవ్ అన్నారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని, భవిష్యత్తులోనూ కార్యకర్తలకు ప్రాధాన్యం కల్పిస్తామని తెలిపారు. ఏ కార్యకర్తకు సమస్య ఎదురైనా పార్టీ నాయకులు అండగా నిలుస్తారని భరోసా ఇచ్చారు.
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో సమష్టి కృషితో విజయం సాధించి పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి, శివన్నకు కానుకగా అందించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.