అర్హులైన విలేకరులందరికీ మీడియా పాస్‌లు మంజూరు చేయాలి
- నిబంధనలను స్పష్టంగా వెల్లడించి పారదర్శకంగా వ్యవహరించాలని డిమాండ్
- మీడియా పాస్‌ల జారీలో వివక్ష చూపొద్దు: మెహర్ బాబా
ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు, అక్టోబర్ 31 (ఎన్ టుడే న్యూస్):
తిరువూరు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మీడియా పాస్‌ల జారీ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. అర్హులైన విలేకరులకు పాస్‌లు మంజూరు చేసే విషయంలో వివక్ష చూపకుండా, నిబంధనల ప్రకారం అందరికీ సమాన అవకాశం కల్పించాలని అమరావతి వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్, ఐక్య ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మెహర్ బాబా డిమాండ్ చేశారు.
ప్రభుత్వ అనుమతులతో ప్రచురితమవుతున్న పత్రికల్లో పనిచేస్తూ, నిరంతరం ప్రజా సమస్యలు, నియోజకవర్గ వార్తలను వెలుగులోకి తీసుకువస్తున్న విలేకరులకు మీడియా పాస్‌లు మంజూరు చేయకుండా, జిల్లా కలెక్టర్ కార్యాలయం జారీ చేసిన అక్రిడిటేషన్ కార్డులు ఉన్నవారికే ప్రాధాన్యం ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.
ప్రెస్ కార్డులు కలిగి, నిరంతరం వార్తా సేకరణ చేస్తున్న జర్నలిస్టులను కూడా ఎన్నికల విధులకు సంబంధించిన మీడియా పాస్‌ల జారీ సమయంలో పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. అక్రిడిటేషన్ కార్డు ఒక్కటే జర్నలిస్టుల గుర్తింపునకు ప్రామాణికమా? ఇతర అర్హతలను ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదని అధికారులను ప్రశ్నించారు.
ఈ విషయంపై తిరువూరు నగర పంచాయతీ కమిషనర్‌ను సంప్రదించగా, జిల్లా కలెక్టర్ నుంచి వచ్చిన సూచనల మేరకు మీడియా పాస్‌లు జారీ చేస్తున్నట్లు ఆయన తెలిపారని మెహర్ బాబా పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు సమాచారాన్ని అందించడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని, అలాంటి సందర్భాల్లో జర్నలిస్టుల మధ్య వివక్షకు తావులేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు.
ఆర్‌ఎన్‌ఐ నమోదు కలిగిన పత్రికల్లో పనిచేస్తూ ప్రతిరోజూ నియోజకవర్గ వార్తలను సేకరించి ప్రచురిస్తున్న జర్నలిస్టులకు కూడా నిబంధనల ప్రకారం అవకాశం కల్పించాలని ఆయన కోరారు. అక్రిడిటేషన్ లేని కారణంతోనే అర్హులైన విలేకరులను పక్కనపెట్టడం తగదని, మీడియా పాస్‌ల జారీకి సంబంధించిన అర్హతలు, నిబంధనలను స్పష్టంగా వెల్లడించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీషాకు మీడియా ప్రతినిధుల తరఫున విజ్ఞప్తి చేసినట్లు మెహర్ బాబా తెలిపారు. ఎన్నికల కవరేజీలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తూ, నిబంధనలకు అనుగుణంగా అర్హులైన జర్నలిస్టులందరికీ సమాన అవకాశం కల్పించాలని కోరారు.