అమృత్ 2.0తో ఏలూరులో మంచినీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం
అమృత్ 2.0తో ఏలూరులో మంచినీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం: ఎంపీ పుట్టా మహేష్ కుమార్
ఏలూరు: అమృత్ 2.0 పథకం కింద ఏలూరు నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో మంచినీటి, మురుగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లక్ష్యంగా పనులు చేపడుతున్నట్లు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. ఏలూరు 27వ డివిజన్ చోదిమెళ్లలో రూ.1.65 కోట్ల వ్యయంతో ఐదు లక్షల లీటర్ల సామర్థ్యమున్న ఓవర్‌హెడ్ ట్యాంకు నిర్మాణానికి ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి)తో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, అమృత్ 2.0 పథకం ద్వారా వచ్చే రెండేళ్లలో ఏలూరు పార్లమెంట్ పరిధిలో రూ.400 కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేపడతామని చెప్పారు. ఒక్క ఏలూరు పట్టణానికే తాగునీటి సరఫరా, మురుగునీటి పారుదల పనుల కోసం రూ.299.37 కోట్లు కేటాయించగా, అందులో మంచినీటి పథకాలకే రూ.143.13 కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో ఎక్కడా మంచినీటి సమస్య లేకుండా రిజర్వాయర్లు, ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్మాణం చేపడుతున్నామని వెల్లడించారు.
అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న ఎంపీ, ఎమ్మెల్యే బడేటి చంటి విజ్ఞప్తి మేరకు ఏటిగట్టు–హనుమాన్‌నగర్ రహదారి అభివృద్ధికి ఎంపీ నిధుల నుంచి రూ.50 లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే చోదిమెళ్లలో మంచినీటి బోరు కోసం మరో రూ.7 లక్షలు కేటాయిస్తామని ప్రకటించారు.
ఏలూరు పార్లమెంట్ పరిధిలో పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తున్నామని, భూముల కొరత సమస్యను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. త్వరలో కోకో సిటీ ఏర్పాటు దిశగా భూముల ఎంపిక పూర్తయిందని వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి పనిచేస్తున్నామని, అభివృద్ధికి ప్రజలు సహకరించాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కోరారు.