బీసీల న్యాయమైన హక్కుల కోసం ప్రాణత్యాగానికి సిద్దం
బీసీల న్యాయమైన హక్కుల కోసం ప్రాణత్యాగానికి సిద్దం
బీసీవై పార్టీ అధినేత బోడో రామచంద్ర యాదవ్ శనివారం మంగళగిరిలో బీసీలు హక్కుల కోసం సౌమ్య నిర్వహించారు ఇందులో భాగంగా అన్నమయ్య జిల్లాకు సంబంధించిన కార్యవర్గము అందులో పాల్గొని విజయవంతం చేశారు
- బీసీ హక్కులకై రామచంద్రయాదవ్ ధర్మదీక్ష పేరుతో ఆమరణ నిరాహారదీక్ష
- ప్రభుత్వం దిగివచ్చేదాకా తగ్గను.. ఐదు డిమాండ్లు నెరవేర్చాల్సిందే
- అమరావతిలో బీసీలకు వెయ్యి ఎకరాలు కేటాయించాలి
- బీసీ రక్షణ చట్టం, కులగణనపై ప్రభుత్వ వంచనను ఎండగట్టిన రామచంద్రయాదవ్
- దీక్షను భగ్నం చేస్తే తీవ్ర పరిణామాలు
- రామచంద్రయాదవ్ ధర్మ దీక్షకు పూలె, మండల్ వారసుల మద్దతు
- మీ దోపిడీలో వాటా అడగట్లేదు, మా హక్కులివ్వండి.. ధ్వజమెత్తిన బిసివై పార్టీ అధినేత
- పూలె జయంతి సాక్షిగా ప్రభుత్వ వంచనపై రామచంద్రయాదవ్ ధర్మయుద్ధం
(ఏప్రిల్ 11, మంగళగిరి)
మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి సాక్షిగా... బిసిల న్యాయమైన డిమాండ్ల సాధనే లక్ష్యంగా బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోడె రామచంద్రయాదవ్ మంగళగిరిలోని పూలె-మండల్ భవన్ వేదికగా బీసీ ధర్మ దీక్ష పేరుతో ఆమరణ నిరాహారదీక్షను ప్రారంభించారు. ఈ దీక్షకు వేలాది మంది బిసి సోదరులు, దళిత, క్రిష్టియన్, మైనార్టీ నాయకులు తరలివచ్చారు. ఈ సందర్భంగా రామచంద్రయాదవ్ ఈ దీక్ష తన వ్యక్తిగతమో, తన పార్టీకో సంబంధించింది కాదని, ఇది కేవలం బీసీల న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం చేస్తున్న ధర్మయుద్ధమని స్పష్టం చేశారు. కార్యక్రమానికి ముందుగా గోపూజ నిర్వహించి, అనంతరం మహనీయులు అంబేద్కర్, జ్యోతిరావ్ పూలె, సావిత్రీ భాయి పూలె, బీపీ మండల్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ దీక్షకు జ్యోతిరావు ఫూలే వారసురాలు నీతా రమాకాంత్, బీపీ మండల్ వారసుడు సూరజ్ మండల్ గారు హాజరై తమ సంపూర్ణ మద్దతును ప్రకటించడం విశేషం. ఈ సందర్భంగా రామచంద్రయాదవ్ మాట్లాడుతూ, ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆగ్రహం
"గత ఫిబ్రవరి 22న 'బీసీ సింహగర్జన' సభ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, కూటమి ప్రభుత్వానికి బీసీల ఐదు ప్రధాన డిమాండ్లను స్పష్టంగా తెలియజేశాం. కానీ, ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాలేదు. స్పందించకపోగా, మా డిమాండ్లపై తప్పుడు ప్రకటనలు చేస్తూ, కుట్రలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు" అని రామచంద్రయాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు.
బీసీ రక్షణ చట్టంపై వంచన
"అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో బీసీ రక్షణ చట్టం తెస్తామని చంద్రబాబు, లోకేష్ ప్రగల్భాలు పలికారు. సుమారు రెండేళ్లు కావస్తున్నా, ఆ చట్టానికి సంబంధించిన ముసాయిదా కూడా ఇప్పటికీ రూపుదిద్దుకోలేదు. దీనిపై ఎలాంటి కమిటీ లేదు, చర్చలు లేవు. గత 15 ఏళ్లలో బీసీలపై జరిగిన అన్యాయాలు, దాడులపై అధికారుల నుంచి నివేదికలు తెప్పించుకోకుండా, కేవలం తప్పుడు కథనాలతో బీసీలను వంచించే కార్యక్రమం చేస్తున్నారు." అని తీవ్ర స్థాయిలో రామచంద్రయాదవ్ ధ్వజమెత్తారు.
రాజధానిలో బీసీల వాటా తేల్చాల్సిందే..
"అమరావతి రాజధాని చంద్రబాబు కుటుంబానికో, వారి సామాజిక వర్గానికో చెందింది కాదు, అది రాష్ట్ర ప్రజలందరిది. గతంలో హైదరాబాద్ చుట్టూ వేలాది ఎకరాలను ఫిలిం సిటీలు, హోటళ్ల పేరిట టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు తమ వారికి అప్పనంగా అప్పజెప్పాయి. అందులో బీసీల వాటా సున్నా. హైదరాబాద్‌లో బీసీలు ఒక చిన్న కార్యక్రమం చేసుకోవాలన్నా ప్రైవేట్ ఫంక్షన్ హాళ్లపై ఆధారపడాల్సిన దుస్థితి ఉంది. అలాంటి పరిస్థితి అమరావతిలో పునరావృతం కాకూడదు. ప్రభుత్వ భవనాలు పోగా, ప్రైవేట్ సంస్థలకు కేటాయించే భూములలో బీసీ భవనాలు, చిరు వ్యాపారులు, పారిశ్రామికవేత్తల కోసం మొదటి విడతగా వెయ్యి ఎకరాలు కేటాయించాలి. ఇది నూటికి నూరు శాతం న్యాయపరమైన డిమాండ్." అని ఆయన తెలిపారు.
రిజర్వేషన్లు, కులగణనపై మోసం
"44 ఏళ్ల క్రితం, పార్టీ ఆవిర్భావం తర్వాత బీసీలకు విద్యా, ఉద్యోగ, చట్టసభల్లో 44 శాతం రిజర్వేషన్లు ఇస్తామని టీడీపీ హామీ ఇచ్చింది. న్యాయపరమైన చిక్కులనే సాకుతో అప్పటి నుంచి బీసీలను మోసం చేస్తూనే ఉంది. టీడీపీ, కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు బీసీల జనాభా ఎంతో తేల్చడానికి సమగ్ర కులగణన చేపట్టకుండా వారిని వంచించాయి. వీరంతా బీసీ ద్రోహులుగా ప్రజలు గుర్తించారు." అని రామచంద్రయాదవ్ ఎద్దేవా చేశారు
*నిధులు లేని బీసీ కార్పొరేషన్లు... అధికారం లేని పదవులు*
"కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తున్నాయి. కార్పొరేషన్లు ఇస్తున్నాం అని చెప్పి ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించకుండా వంచిస్తున్నాయి. కాబట్టి, బీసీ కార్పొరేషన్లకు తక్షణమే జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయించాలి. ఆంధ్రప్రదేశ్ లో బిసి కార్పోరేషన్లు పదవులు ఇచ్చారే తప్ప వారికి అధికారాన్ని మాత్రం ఇవ్వలేదు" అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మా హక్కులు మాకివ్వండి, మీ దోపిడీలో వాటా అడగట్లేదు
"టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలు ఏయే రకాలుగా దోపిడీ చేశాయో మాకు తెలుసు. మీరు దోపిడీ చేస్తున్న ఇసుక, ఖనిజ సంపదలో మేము వాటా అడగడం లేదు. రైతుల నుంచి బలవంతంగా తీసుకుంటున్న వేలాది ఎకరాలలో వాటా అడగడం లేదు. మా న్యాయపరమైన, రాజ్యాంగబద్ధమైన డిమాండ్లను నెరవేర్చమని మాత్రమే ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాం." అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నా దీక్షను భగ్నం చేయాలని చూస్తే తీవ్ర పరిణామాలు
"ఈ ఐదు డిమాండ్లు నెరవేర్చేంత వరకు నా 'బీసీ ధర్మ దీక్ష' కొనసాగుతుంది. ఈ దీక్షను భగ్నం చేయాలని గానీ, కుట్రలు పన్నాలని గానీ ప్రభుత్వం ప్రయత్నిస్తే, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది" అని రామచంద్రయాదవ్ ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ సందర్భంగా రామచంద్రయాదవ్ ధర్మ దీక్షకు సమాజ్ వాదీ పార్టీ రాష్ట్ర నేతలు పాశం వెంకటేశ్వర్లు, టి కళ్యాణ్ కుమార్, షేక్ నజీర్ భాషా, ఆర్జేడీ పార్టీ ప్రతినిధి శ్రీనివాస్ యాదవ్, జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు మేకల రాము, బిసి సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ తూమాటి కృష్ణమాచారి, భారత శ్రీకృష్ణ దేవేంద్ర యాదవ సంఘం అధ్యక్షులు గోలి వెంకటేశ్వర యాదవ్, శ్రీ కేదేశ్వర స్వామి మేదర సంఘం అధ్యక్షులు నందికట్టి శేఖర్ రావు, జననాయక్ కర్పూరి ఠాకూర్ పౌండేషన్ ఛైర్మన్ కె శ్రీ కుమార్, మున్నూరు కాపు తెలంగాణా అధ్యక్షులు పర్వత సతీష్ కుమార్, తెలంగాణా రాష్ట్ర రజకసంఘం అధ్యక్షులు చాపర్తి కుమార్, పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు జగ్గారపు శ్రీమివాసరావు, బిసి ఇంటర్నేషనల్ అధ్యక్షులు డాక్టర్ ఎన్ వి రావు తో పాటు పద్మశాలి రాజ్యాధికార పార్టీ, ముదిరాజ్ రాజ్యాధికార పార్టీ, ఆర్యకటక సంఘం, వడ్డెర రాజ్యాధికార పార్టీ, గౌడ రాజ్యాధికార పార్టీ ప్రతినిధులు, తదితరులు మద్దతు పలికారు