BREAKING
శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి
www.ntodaynews.com

చాట్రాయి రాజకీయాల్లో సమర శంఖం.. దేశిరెడ్డి కంచుకోటకు మంత్రి పార్థసారథి సవాల్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Aug, 2026 - 09:49 AM
105 వీక్షణలు

ఎంపీపీ, జెడ్పీటీసీ పీఠాల కోసం హోరాహోరీ పోరు

రెండు దశాబ్దాల ఆధిపత్యానికి అధికార పార్టీ నుంచి గట్టి సవాల్

ప్రజా సమస్యల పరిష్కారంతో పెరుగుతున్న మంత్రి పార్థసారథి ప్రభావం

చాట్రాయి, ఆగస్టు 24:

స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఏలూరు జిల్లా చాట్రాయి మండల రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. గత రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న రాజకీయ ఆధిపత్యానికి ఈసారి అధికార తెలుగుదేశం పార్టీ గట్టి సవాల్ విసురుతోంది. ఎంపీపీ, జెడ్పీటీసీ పీఠాలు ఎవరి ఖాతాలో పడతాయన్నది ప్రస్తుతం మండల రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఒకవైపు పాత రాజకీయ పట్టు, గ్రామస్థాయి బలమైన నెట్‌వర్క్‌తో దేశిరెడ్డి రాఘవరెడ్డి వర్గం ముందుకు సాగుతుండగా.. మరోవైపు రాష్ట్ర అధికార బలం, మంత్రి కొలుసు పార్థసారథి వ్యూహాలతో తెలుగుదేశం పార్టీ దూకుడు పెంచుతోంది. దీంతో చాట్రాయి మండల ఎన్నికల పోరు ఈసారి సాధారణ పోటీ కాకుండా ప్రతిష్టాత్మక పోరుగా మారనుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

చాట్రాయి మండల రాజకీయ చరిత్రను పరిశీలిస్తే దేశిరెడ్డి రాఘవరెడ్డి పేరు ప్రత్యేకంగా వినిపిస్తుంది. పార్టీలు మారినా, రాజకీయ పరిస్థితులు మారినా తన వ్యూహాలతో అనుకూల ఫలితాలు సాధించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉందని స్థానిక రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

గతంలో తెలుగుదేశం పార్టీకి చెందిన కందుల కృష్ణ ఎంపీపీ పదవికి రాజీనామా చేసిన అనంతరం జరిగిన పరిణామాలు మండల రాజకీయాల్లో కీలక మలుపుగా నిలిచాయి. అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన చిత్తపూరు ఎంపీటీసీ కందిమల్ల వెంకటేశ్వరరావు ఎంపీపీగా ఎన్నికయ్యారు.

అప్పటి పరిస్థితుల్లో టీడీపీకి ఎనిమిది మంది ఎంపీటీసీలు ఉన్నప్పటికీ, రాజకీయ సమీకరణాలు మారడంతో ఎంపీపీ పీఠం చేజారింది. దేశిరెడ్డి రాఘవరెడ్డి తన రాజకీయ చతురతతో ఇద్దరు టీడీపీ ఎంపీటీసీలను కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చేలా చేసి కందిమల్ల వెంకటేశ్వరరావు ఎంపీపీగా ఎన్నికయ్యేలా చేశారని రాజకీయ వర్గాలు ఇప్పటికీ చర్చించుకుంటున్నాయి.

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనూ చాట్రాయి మండలంలో దేశిరెడ్డి వర్గం ప్రభావం తగ్గలేదని స్థానికులు చెబుతున్నారు. అప్పటి నుంచి ఎంపీపీ పీఠంపై ఆ వర్గం ఆధిపత్యం కొనసాగిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

సుమారు 20 సంవత్సరాల కాలంలో నాలుగు సార్లు జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఒక్కసారి కూడా పీఠాన్ని దక్కించుకోలేకపోయిందని రాజకీయ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. రిజర్వేషన్ ఏదైనా తమ అనుకూల అభ్యర్థులను గెలిపించుకోవడంలో దేశిరెడ్డి వర్గం కీలక పాత్ర పోషించిందని చెబుతున్నారు.

కందిమల్ల వెంకటేశ్వరరావు, దేశిరెడ్డి హేమావతి, పరసా రమాదేవి, లంక నిర్మల తదితరులు ఎంపీపీ పదవులు చేపట్టడం వెనుక దేశిరెడ్డి రాజకీయ వ్యూహాలు ఉన్నాయని ఆయన అనుచరులు పేర్కొంటున్నారు.

జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ ఇదే ప్రభావం కనిపించిందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే విజయాలు సాధించారు. పరసా పుల్లయ్య, గోలి పద్మావతి, లాం తాంతియా కుమారి, చెలికాని అనూషలు జెడ్పీటీసీలుగా విజయం సాధించారు.

చాట్రాయి మండలంలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా తెలుగుదేశం పార్టీ జెడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకోలేకపోవడం అధికార పార్టీకి పెద్ద సవాల్‌గా మారింది. ఈసారి ఆ చరిత్రను తిరగరాయాలని టీడీపీ పట్టుదలతో ఉందని తెలుస్తోంది.

2024 అసెంబ్లీ ఎన్నికల తర్వాత చాట్రాయి మండల రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలైందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. మంత్రి కొలుసు పార్థసారథికి మండలంలో వచ్చిన మెజార్టీ, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

మంత్రి పార్థసారథి చాట్రాయి మండలాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మండలంలో ఆయన ఏ కార్యక్రమానికి వచ్చినా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బ్రహ్మరథం పడుతున్నారని నాయకులు చెబుతున్నారు.

కార్యకర్తలు, సామాన్య ప్రజలు నేరుగా తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను మంత్రి ప్రాధాన్యంగా తీసుకుని పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటున్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

బూరుగుగూడెం, పర్వతాపురం గ్రామాలకు చెందిన చిలుకుబత్తుల సత్యనారాయణకు సంబంధించిన పొలాలకు వెళ్లే దారి సమస్య విషయంలో మంత్రి చూపిన చొరవ స్థానికంగా చర్చనీయాంశమైంది. సమస్యను తెలుసుకున్న అనంతరం మంత్రి స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి, సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలను సూచించారని చెబుతున్నారు.

గ్రామంలోకి వెళ్లి ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకోవడం, కార్యకర్త చెప్పిన అంశాన్ని కూడా ప్రాధాన్యంగా తీసుకోవడం మంత్రి పార్థసారథి పనితీరులో మార్పును చూపుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పుట్టినిల్లుగా భావించే కొన్ని గ్రామాల్లోనూ మంత్రి పార్థసారథి ప్రభావం పెరగడం రాజకీయంగా చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా బూరుగుగూడెం వంటి గ్రామాల్లో అధికార పార్టీకి అనుకూల వాతావరణం ఏర్పడుతోందని టీడీపీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

ఇదే సమయంలో దేశిరెడ్డి రాఘవరెడ్డి తన రాజకీయ అనుభవం, వ్యూహాలతో మరోసారి తన సత్తా చాటుతారా? లేక మంత్రి పార్థసారథి వ్యూహాలు ఆయన ఆధిపత్యానికి అడ్డుకట్ట వేస్తాయా? అన్నది ఆసక్తికరంగా మారింది.

మంత్రి పార్థసారథి నాయకత్వంలో, మండల టీడీపీ అధ్యక్షుడు ఇజ్జిగాని వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీ గ్రామస్థాయి కార్యక్రమాలను వేగవంతం చేస్తోంది. అభివృద్ధి, సమస్యల పరిష్కారం అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ఎన్నికల సమరానికి సిద్ధమవుతోంది.

చాట్రాయి మండలంలో ఈసారి జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు కేవలం పదవుల కోసం జరిగే పోరు కాదని, రెండు రాజకీయ శక్తుల మధ్య ఆధిపత్య పోరుగా మారనున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

దేశిరెడ్డి రాజకీయ వ్యూహాలకు మరోసారి ప్రజా మద్దతు లభిస్తుందా? లేక మంత్రి పార్థసారథి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ చాట్రాయిలో కొత్త చరిత్ర సృష్టిస్తుందా? అనేది ఎన్నికల ఫలితాల వరకు ఉత్కంఠగా మారనుంది.