చిట్యాల శివాలయంలో కోతుల బీభత్సం..
నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక శివాలయంలో కోతులు బీభత్సం సృష్టించాయి. శుక్రవారం తెల్లవారుజామున పండితులు ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సమయంలో వెనుకభాగంలోని స్టోర్‌రూంలోకి ఒక్కసారిగా కోతులు చొరబడ్డాయి. అక్కడ ఉన్న వస్తువులను చిందరవందర చేసి, పలు సామగ్రిని ధ్వంసం చేసినట్లు స్థానికులు తెలిపారు. ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో కోతులు ఆలయ పరిసరాల్లోకి రావడంతో కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు. కోతుల సంచారం ఎక్కువ కావడంతో ఆలయానికి వచ్చే భక్తులు కూడా తీవ్ర భయంతో ఉన్నారు. చిన్నారులు, వృద్ధులు ఆలయ పరిసర ప్రాంతాల్లోకి వెళ్లేందుకు జంకుతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాల్లో కోతుల బెడద తీవ్రంగా ఉందని స్థానికులు పేర్కొన్నారు. కోతుల వల్ల ప్రజలకు, భక్తులకు ఎలాంటి ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించాలని కోరుతున్నారు. తక్షణమే కోతులను పట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టాలని, మున్సిపాలిటీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.