విశాల్ గున్ని, కాంతి రాణా టాటాలపై సస్పెన్షన్ ఎత్తివేత
తక్షణమే విధుల్లోకి తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు
క్రమశిక్షణ, క్రిమినల్ కేసులపై నిర్ణయం ప్రభావం ఉండదని స్పష్టీకరణ
అమరావతి, సెప్టెంబర్ 3: సీనియర్ ఐపీఎస్ అధికారులు విశాల్ గున్ని, కాంతి రాణా టాటాలపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. వారిని తక్షణమే విధుల్లోకి పునరుద్ధరిస్తూ గురువారం సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. విశాల్ గున్ని 2010 బ్యాచ్‌కు, కాంతి రాణా టాటా 2004 బ్యాచ్‌కు చెందిన అధికారులు.
అఖిల భారత సర్వీసుల క్రమశిక్షణ, అప్పీల్ నిబంధనల ప్రకారం గతంలో వీరిద్దరినీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అనంతరం సస్పెన్షన్‌ను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పొడిగిస్తూ వచ్చింది. తాజాగా వీరి సస్పెన్షన్ సెప్టెంబర్ 4 వరకు అమల్లో ఉండగా, అంతకుముందే ప్రభుత్వం సస్పెన్షన్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఇద్దరు అధికారుల సస్పెన్షన్ ఎత్తివేతకు సంబంధించి పోలీసు శాఖ అధిపతి ఇచ్చిన నివేదికలను ప్రభుత్వం పరిశీలించింది. కాంతి రాణా టాటా ఆగస్టు 24న సమర్పించిన వినతిపత్రాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంది. సంబంధిత అంశాలన్నింటినీ పరిశీలించిన అనంతరం సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
దీంతో విశాల్ గున్ని, కాంతి రాణా టాటాలను తక్షణమే విధుల్లోకి పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, వీరిపై కొనసాగుతున్న క్రమశిక్షణా చర్యలు, నేర సంబంధ కేసులపై సస్పెన్షన్ ఎత్తివేత నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ పేరుతో ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉత్తర్వుల ప్రతులను ఇద్దరు అధికారులకు అందజేసి, వారి నుంచి రసీదు తీసుకోవాలని పోలీసు శాఖ అధిపతిని ప్రభుత్వం ఆదేశించింది.