చిత్తపూరు ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
విద్యార్థుల భవిష్యత్తుకు ఉపాధ్యాయులే బలమైన పునాది
– రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చిత్తపూరు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో శనివారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి మంత్రి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఉపాధ్యాయులను సత్కరించి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని మంత్రి పార్థసారథి అన్నారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే తమ లక్ష్యాలను నిర్దేశించుకుని, క్రమశిక్షణతో పాటు పట్టుదలతో విద్యను అభ్యసించాలని సూచించారు. నిరంతర కృషితో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
కూటమి ప్రభుత్వం విద్యా రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి తెలిపారు. విద్యా రంగంలో చేపడుతున్న సంస్కరణలు, నూతన విద్యా విధానం, ఆధునిక సాంకేతికతను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువస్తున్న విధానాలను ఈ సందర్భంగా వివరించారు. విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించి భవిష్యత్తులో మెరుగైన అవకాశాలు అందుకునేలా పాఠశాల విద్యను తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొన్నారు.