చిత్తపూరులో రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేసిన మంత్రి కొలుసు పార్థసారధి
2027 మార్చి నాటికి రెవెన్యూ సమస్యలన్నింటికీ పరిష్కారం
గొడ్డలి పార్టీతో జాగ్రత్తగా ఉండండి.. ఆస్తులు లాగేసుకుంటారు: మంత్రి పార్థసారథి
చాట్రాయి/నూజివీడు, సెప్టెంబరు 5: రైతుల భూములకు పూర్తి భద్రత కల్పించేందుకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలను అందిస్తున్నామని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. చాట్రాయి మండలం చిత్తాపూరు గ్రామంలో నిర్వహించిన “మీ భూమి–మీ హక్కు” కార్యక్రమంలో రైతులు, భూ యజమానులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను మంత్రి పంపిణీ చేశారు.
గ్రామంలో ఇప్పటికే 90 శాతం పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశామని మంత్రి తెలిపారు. మిగిలిన పాసుపుస్తకాలను కూడా త్వరితగతిన పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతి రైతుకు పాసుపుస్తకం అందే వరకు ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.
రైతుల భూహక్కుల పరిరక్షణకు ప్రాధాన్యత
రైతుల భూహక్కుల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పార్థసారథి అన్నారు. సర్వే పూర్తయిన ప్రతి రైతుకు భద్రతతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలను అందిస్తున్నామని తెలిపారు.
అధికారుల్లో అలసత్వం, నిర్లక్ష్యాన్ని తొలగించడంతో పాటు రైతులకు భూహక్కులపై మరింత భరోసా కల్పించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి నెలా ఒక గ్రామాన్ని సందర్శించి స్వయంగా పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర మంత్రులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని పాసుపుస్తకాలు అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు.
గత ప్రభుత్వంపై విమర్శలు
గత ప్రభుత్వం భూ వివాదాలను సృష్టించి, భూ రికార్డులను తారుమారు చేసిందని మంత్రి ఆరోపించారు. భూముల యాజమాన్య హక్కులకు నష్టం కలిగించే విధంగా భూయాజమాన్య హక్కుల చట్టాన్ని తీసుకువచ్చిందని విమర్శించారు.
గత పాలకులు పట్టాదారు పాసుపుస్తకాలపై తమ ఫొటోలు ముద్రించుకున్నారని, కూటమి ప్రభుత్వం మాత్రం రైతుల హక్కులకు ప్రతీకగా రాజముద్రను ముద్రించిందని అన్నారు. పొలం సరిహద్దు రాళ్లపై కూడా తమ చిత్రాలను ముద్రించుకున్నారని విమర్శించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ చట్టాన్ని రద్దు చేసి రైతుల భూమి యాజమాన్య హక్కులను పరిరక్షించిందని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుతూ భూ రికార్డులను ప్రక్షాళన చేసేందుకు సమయం పట్టిందన్నారు.
రీ-సర్వే ప్రక్రియలో రైతులను భాగస్వాములను చేసి, భూమి వివరాలను తనిఖీ చేయడంతో పాటు ఈ-కేవైసీ పూర్తి చేసిన అనంతరం తప్పులు లేకుండా పట్టాదారు పాసుపుస్తకాలను జారీ చేస్తున్నామని వివరించారు.
క్యూఆర్ కోడ్‌తో భూమి వివరాలు
పట్టాదారు పాసుపుస్తకంలోని క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా పట్టాదారు వివరాలు, భూమి వివరాలు, విస్తీర్ణం, భూమి పటం, మార్గ పటం, ఉపగ్రహ చిత్రాలు వంటి వివరాలను తెలుసుకోవచ్చని మంత్రి రైతులకు వివరించారు.
2027 మార్చి నాటికి రెవెన్యూ సమస్యలకు పరిష్కారం
2027 మార్చి నాటికి రాష్ట్రంలో రెవెన్యూ సంబంధిత సమస్యలన్నింటినీ పూర్తిగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. భూ సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
నియోజకవర్గంలో, గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. వాస్తవాలను ప్రజలకు వివరించి తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
“గొడ్డలి పార్టీతో జాగ్రత్తగా ఉండండి.. అధికారంలోకి వస్తే మీ ఆస్తులను లాగేసుకుంటారు” అని మంత్రి ప్రజలను హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ బి.వినూత్న, తహసీల్దార్ బి శ్వేత మండల అభివృద్ధి అధికారి సత్యనారాయణ వివిధ శాఖల అధికారులు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఇజ్జిగాని.వెంకటేశ్వరరావు, గ్రామ సచివాలయ, రెవెన్యూ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు, రైతులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.