వరంగల్ ఎయిర్‌పోర్ట్‌పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ
/
హన్మకొండ
వరంగల్: వరంగల్ విమానాశ్రయం అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్లపాటు వరంగల్ ఎయిర్‌పోర్ట్ అంశాన్ని పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. తమ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
విమానాశ్రయానికి అవసరమైన భూసేకరణ కోసం ప్రభుత్వం రూ.295 కోట్లు చెల్లించిందని సీఎం పేర్కొన్నారు. సేకరించిన భూమిని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI)కి అప్పగించినట్లు వెల్లడించారు.
వరంగల్ ఎయిర్‌పోర్ట్ కేవలం విమాన రాకపోకలకు పరిమితం కాకుండా పరిశ్రమలు, పర్యాటకం, విద్య, ఉద్యోగాలు, పెట్టుబడులకు గేట్‌వేగా మారే అవకాశం ఉందని రేవంత్‌రెడ్డి తెలిపారు. విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఉమ్మడి వరంగల్ ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలకు ఊతం లభిస్తుందని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, ప్రతిపాదిత వరంగల్ విమానాశ్రయానికి ఏ పేరు పెట్టాలనే అంశంపై ప్రజలు తమ సూచనలు ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి ‘ఎక్స్’ వేదికగా కోరారు. విమానాశ్రయానికి డిసెంబర్‌లో శంకుస్థాపన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.