సూపర్ సిక్స్ హామీలలో ఒకటైన నిరుద్యోగులకు చెందిందా
NTODAY NEWS: తిరువూరు జూన్ 20 (ఎన్ టుడే న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి)
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజీవ్ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో తిరువూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పల్లెపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈనెల 12 వ తేదీకి సంవత్సరం పూర్తయిందని ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నరుడా ఏమి కావాలో కోరుకో అన్న చందంగా ఆకాశమే హద్దుగా ఎవరూ అడగకపోయినా సూపర్ సిక్స్ తో పాటుగా, ఇంకా 170 కు పైగా హామీలను ఇవ్వడం జరిగినది. సూపర్ సిక్స్ హామీలలో ఒకటైన నిరుద్యోగులకు ఐదు సంవత్సరములకు 20 లక్షల ఉద్యోగ కల్పన, ఉద్యోగం రాకపోతే ఉద్యోగం వచ్చేవరకు నెలకు రూ 3000 లు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఈనాటి వరకు అమలు చేసిన పాపాన పోలేదు. అదేవిధంగా ప్రతి మహిళకు 1500 రూపాయలు నెలకు చెల్లించే విధంగా మరొక హామీ ఇచ్చి ఉన్నారు, కానీ దానిని కూడా అమలు జరపలేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఈనాటికి అమలు చేసి ఉండలేదు. అదేవిధంగా సంవత్సరమునకు మూడు గ్యాస్ బండలు ఉచితంగా ఇస్తామని చెప్పి ఉన్నారు. ఆ పధకం కూడా సక్రమంగా అమలు జరగడం లేదు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటినప్పటికీ ప్రతి రైతుకు సంవత్సరమునకు 20 వేల రూపాయలు రైతు నేస్తం ఇస్తామని ప్రకటించి ఉన్నారు, కానీ ఈనాటికీ అది అందని ద్రాక్ష గానే మిగిలి ఉన్నది. తల్లికి వందనం క్రింద 15000 రూపాయలు ప్రతి ఒక్క విద్యార్థినికి తల్లుల అకౌంట్లో జమ చేస్తామని ఎన్నికల వాగ్దానంలో చెప్పి 13000 రూపాయలతో సరిపెట్టి ఉన్నారు. ఇది ఎంత మాత్రం సమర్ధనీయం కాదు. అదేవిధంగా ఎస్సీ ,ఎస్టీ, బీసీలకు 50 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తామని చెప్పి ఆ ఊసే ఎత్తటం లేదు . గత పది సంవత్సరాల క్రితం నిర్మాణం అయిన టిడ్కో ఇండ్లను అర్హులైన పేదలకు తక్షణమే పంచి ప్రభుత్వం వారి యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని అలా చేయని యెడల మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలు 151 సీట్లు ఇస్తే మూడు నెలలకు ఒకసారి బటన్ నొక్కినప్పటికీ మూడు రాజధానులతో మధ్యలో ఉన్న ఐదుని తీసివేసి 11 సీట్లకు పరిమితం చేయటం చూసే ఉన్నారు. ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వం వారు ఇచ్చినటు వంటి ఎన్నికల హామీలు అన్నింటిని అమలు చేయని యెడల మీకు ప్రజలు ఇచ్చిన 164 సీట్లలో మధ్యలో ఉన్న 6 తీసి 14 కే భవిష్యత్తులో పరిమితం చేస్తారని గుర్తెరిగి ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొడ్డు ప్రకాష్ రావు మాట్లాడుతూ తిరువూరు నియోజకవర్గంలో తిరువూరు టు అక్క పాలెం రోడ్డు, అదే విధంగా తిరువూరు బస్టాండ్ నుంచి సూర్య రెస్టారెంట్ వైపు వెళ్ళు రోడ్డు, తిరువూరు టు కోకిలంపాడు రోడ్డు, తిరువూరు టు తునికిపాడు రోడ్డు, సత్యాలపాడు నుంచి వయా చింతలనర్వ టు ఊటుకూరు రోడ్డు, అదేవిధంగా జింకల పాలెం టు ఊటుకూరు గ్రావెల్ రోడ్డు అధ్వానంగా ఉన్నాయని వాటిని తిరువూరు స్థానిక శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు వెంటనే పర్యవేక్షించి వాటి నిర్మాణమునకు ప్రభుత్వం నుండి నిధులు తీసుకొచ్చి త్వరగా పూర్తి చేయాలని అదేవిధంగా గత పది సంవత్సరములుగా వినగడప కట్టలేరు పై బ్రిడ్జి కూలిపోయి తెలంగాణ, ఆంధ్ర ప్రాంతములకు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుటయే కాక దాదాపుగా 20 గ్రామాలకు పైగా ప్రజలు తీవ్ర అవస్థల పాలవుతున్నారని దానికి గాను 30 కోట్ల రూపాయలతో బ్రిడ్జి నిర్మాణం నిమిత్తం టెండర్ కి వెళ్లినట్లుగా ప్రచారం జరుగుచున్నది దానిపై శాసనసభ్యులు తగు శ్రద్ధ తీసుకొని ప్రభుత్వము నుండి నిధులు తెప్పించి త్వరగా పూర్తి చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఉప్పలపాటి లక్ష్మీ దాస్ మాట్లాడుతూ సతీష్ గడ్ టు ఇబ్రహీంపట్నం జాతీయ రహదారి పై రామచంద్రాపురం గ్రామంలో రోడ్డు నిర్మాణము పూర్తి కాకపోవటం వలన వాహనదారులకు, ప్రజలకు తీవ్రమైన అసౌకర్యము కలుగుట యే కాక అక్కడ ఉన్న గుంటల వలన నిత్యం ప్రమాదములు సంభవించు చున్నవి. అందువలన స్థానిక శాసనసభ్యులు శ్రీనివాసరావు మరియు విజయవాడ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు కేశినేని శివనాథ్ (చిన్ని) దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి కాంపెన్సేషన్ చెల్లించవలసిన వారికి చట్ట ప్రకారం చెల్లించి అసంపూర్తిగా నిలిచిపోయిన రోడ్డు నిర్మాణం పూర్తి చేసి జాతీయ రహదారిపై రాకపోకలకు ఆటంకం లేకుండా ,ప్రమాదాలు జరగకుండా చూడాలని, అదేవిధంగా కృష్ణా జలాలను తిరువూరుకు కూడా తీసుకొని వచ్చి ఈ ప్రాంత వాసులకు అందే విధముగా చేయాలని కోరారు. కార్యక్రమంలో బి.సి. సెల్ రాష్ట్ర నాయకులు మరియు జాతీయ మానవ హక్కుల కౌన్సిల్ ఉపాధ్యక్షులు గంజా కృష్ణమోహన్, ఉమ్మడి కృష్ణాజిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి కొత్త గుండ్ల గోపాలకృష్ణ,కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజీవ్ భవన్ ఇంచార్జ్ చిన్నంశెట్టి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

