ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోండి
ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోండి ధ్రువపత్రాల పేరుతో డబ్బులు వసూలు చేసే వారిని నమ్మొద్దు బుర్రి శ్రీకర్
ఏలూరు జిల్లా: ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లకు కొత్తగా అర్హులైన వారి నుంచి దరఖాస్తుల స్వీకరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిందని భారతీయ జనతా పార్టీ ఏలూరు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు శ్రీకర్ బుర్రి తెలిపారు. సెప్టెంబరు 7 నుంచి 16వ తేదీ వరకు మాత్రమే కొత్త పెన్షన్లకు దరఖాస్తులు స్వీకరించనున్న నేపథ్యంలో అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వితంతువులు, ఒంటరి మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు, చేనేత కార్మికులు, మత్స్యకారులు, లింగమార్పిడి వ్యక్తులు, చర్మకార్మికులు, డప్పు కళాకారులు తదితర అర్హత కలిగిన వర్గాల వారు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అయితే ముఖ్యంగా చర్మకార్మికులు, డప్పు కళాకారులకు సంబంధించిన అధికారిక ధ్రువీకరణ పత్రాలు చాలామంది వద్ద లేకపోవడంతో వారు ఇబ్బందులు పడుతున్నారని శ్రీకర్ బుర్రి పేర్కొన్నారు. సంబంధిత ధ్రువపత్రాలు పొందేందుకు అధికారులకు కూడా పరిమిత సమయం ఉండటంతో అర్హులైన వారు దరఖాస్తు చేసుకునే అవకాశం కోల్పోకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర సామాజిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 12 పేజీల స్వీయ ధ్రువీకరణ పత్రాలను అన్ని గ్రామ సచివాలయాలకు పంపించారని చెప్పారు. సంక్షేమ సహాయకులు, కంప్యూటర్ ఆపరేటర్ల వద్ద ఈ పత్రాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అర్హత ఉన్న వారు వాటిని సద్వినియోగం చేసుకుని నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే వారు ఆధార్ కార్డు, కుల ధ్రువపత్రం, ఆదాయ ధ్రువపత్రం, పాస్‌పోర్ట్ పరిమాణం ఫొటోలు, తాము నిర్వహిస్తున్న వృత్తికి సంబంధించిన ఫొటోలు, బ్యాంకు ఖాతా ప్రతులు, అందుబాటులో ఉన్న ఇతర సంబంధిత పత్రాలను గ్రామ సచివాలయ సిబ్బందికి అందజేయాలని తెలిపారు. సచివాలయంలో అందించే స్వీయ ధ్రువీకరణ పత్రాలను సక్రమంగా పూర్తి చేసి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ధ్రువపత్రాలు ఇప్పిస్తామని, పెన్షన్ మంజూరు చేయిస్తామని చెప్పి కొందరు డబ్బులు వసూలు చేసే అవకాశం ఉందని, అలాంటి వ్యక్తులను నమ్మి మోసపోవద్దని శ్రీకర్ బుర్రి హెచ్చరించారు. పెన్షన్ దరఖాస్తు ప్రక్రియలో మధ్యవర్తులకు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. దరఖాస్తుల స్వీకరణ అనంతరం ప్రభుత్వ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహిస్తారని, అర్హతలు మరియు సమర్పించిన వివరాలను పరిశీలించిన తర్వాత నిబంధనలకు అనుగుణంగా అర్హులైన వారికి మాత్రమే పెన్షన్ మంజూరు అవుతుందని తెలిపారు. ఎవరూ తప్పుడు పత్రాలు సమర్పించి దరఖాస్తు చేయవద్దని, తప్పుడు వివరాలతో ప్రభుత్వాన్ని, అధికారులను మోసం చేసే ప్రయత్నం చేయవద్దని శ్రీకర్ బుర్రి కోరారు. దరఖాస్తుల స్వీకరణకు సమయం తక్కువగా ఉన్నందున అర్హులైన పెన్షన్ ఆశావహులు ఆలస్యం చేయకుండా తమ గ్రామ సచివాలయాన్ని సంప్రదించి అవసరమైన వివరాలు సమర్పించి దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.