నిర్లక్ష్యం వహిస్తే జీవితంలో మిగిలేది చీకటే
విద్యుత్ భద్రతపై రైతులు, కార్మికులకు అవగాహన విద్యుత్ భద్రత పాటిస్తే చీకటిని పారద్రోలవచ్చు నిర్లక్ష్యం వహిస్తే జీవితంలో మిగిలేది చీకటే
పోలవరం ఉపవిభాగ పోలీసు అధికారి కడలి జయకృష్ణ
టి.నరసాపురం: విద్యుత్ పనుల్లో భద్రతా నిబంధనలు పాటిస్తే ప్రమాదాలను నివారించి జీవితాల్లో వెలుగులు నింపుకోవచ్చని, నిర్లక్ష్యం వహిస్తే జీవితంలో చీకటి మిగిలే ప్రమాదం ఉందని పోలవరం ఉపవిభాగ పోలీసు అధికారి కడలి జయకృష్ణ అన్నారు. ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు టి.నరసాపురం మండలంలోని పామాయిల్ తోటల్లో గెలలు కోసే సమయంలో విద్యుత్ షాక్ ప్రమాదాల నివారణకు రైతులు, గెలకోత కార్మికులకు అవగాహన కల్పించేందుకు సదస్సు నిర్వహించారు. టి.నరసాపురం ఎంపీడీవో కార్యాలయంలో పోలీసు శాఖ, ఉద్యానవన శాఖ, గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి టి.నరసాపురం ఎస్‌హెచ్‌వో ఎం. జయబాబు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన పోలవరం ఉపవిభాగ పోలీసు అధికారి కడలి జయకృష్ణ మాట్లాడుతూ పామాయిల్ తోటల్లో గెలలు కోసే సమయంలో విద్యుత్ తీగలకు సమీపంగా పనిచేసేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యుత్ తీగలకు తగిలే అవకాశం ఉన్న పనిముట్లు, పొడవైన కర్రలు ఉపయోగించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, విద్యుత్ ప్రమాదాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదని రైతులు, కార్మికులకు సూచించారు. జీలుగుమిల్లి వృత్తం పోలీసు ఇన్‌స్పెక్టర్ యాదగిరి మాట్లాడుతూ రానున్న వినాయక చవితి సందర్భంగా ఉత్సవ నిర్వాహకులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ తీగలకు సమీపంలో మండపాలు ఏర్పాటు చేయకుండా జాగ్రత్తలు పాటించాలని, ఊరేగింపులు, విద్యుత్ అలంకరణల సమయంలో ప్రమాదాలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టాలని తెలిపారు. అనంతరం ఉపవిభాగ పోలీసు అధికారి హోదాలో తొలిసారి టి.నరసాపురం వచ్చిన కడలి జయకృష్ణను ‘మేము సైతం’ మిత్ర బృందం ఆధ్వర్యంలో శాలువాతో ఆత్మీయంగా సత్కరించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. విద్యుత్ ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలతో కూడిన వినతిపత్రాన్ని సంబంధిత అధికారులకు అందజేశారు. రానున్న వినాయక చవితి నేపథ్యంలో ప్రజలు భక్తిశ్రద్ధలతో ఉత్సవాలు నిర్వహించే సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారి అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో టి.నరసాపురం ఎంపీడీవో వై.వి.ఆర్.వి. ప్రసాద్, విద్యుత్ శాఖ జంగారెడ్డిగూడెం విభాగం కార్యనిర్వాహక ఇంజినీర్ పీర్ అహ్మద్ ఖాన్, ప్రసార సంస్థ సహాయ ఇంజినీర్ శ్రీనివాస్, నవభారత్ సంస్థ ప్రతినిధి కె. వెంకటేశ్వరరావు, గ్రామ పెద్దలు, పామాయిల్ రైతులు, గెలకోత కార్మికులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.