ఎన్టీఆర్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి సిపిఐ, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో తిరువూరులో ధర్నా
తిరువూరు: ఎన్టీఆర్ జిల్లాలో నెలకొన్న తీవ్ర అనావృష్టి పరిస్థితులను అంచనా వేసి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి రైతులు, వ్యవసాయ కార్మికులు, పేదలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని సిపిఐ, వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేశాయి. ఈ మేరకు శుక్రవారం తిరువూరు మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు తూము కృష్ణయ్య, వ్యవసాయ కార్మిక సంఘం ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి చిలుకూరి వెంకటేశ్వరరావు, సిపిఐ తిరువూరు పట్టణ కార్యదర్శి మాలపాటి ఉదయ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాయని, అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు.
నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోవడంతో పేద, మధ్యతరగతి కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందన్నారు. బియ్యం, నూనె, చక్కెర, కూరగాయలు, పప్పులు తదితర నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ధరల పెరుగుదల కారణంగా వినియోగదారుల కొనుగోలు శక్తి తగ్గిపోతోందని, ప్రజల ఆదాయం పెరగకపోగా నిత్యావసర వస్తువుల ధరలు మాత్రం భారీగా పెరుగుతున్నాయని పేర్కొన్నారు. దీంతో సామాన్య, పేద కుటుంబాలు ఆర్థికంగా కుంగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వాలు ఎలాంటి సమర్థవంతమైన చర్యలు తీసుకోవడం లేదని వారు విమర్శించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రజల ఆదాయాన్ని పెంచడంతో పాటు ధరల నియంత్రణకు తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూడా ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు మూడు సెంట్ల ఇళ్ల స్థలం, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్ల ఇళ్ల స్థలం ఇస్తామని, పేదవాడి గృహ నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు అందిస్తామని ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. ఆ హామీలను అమలు చేసి పేదలకు ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణానికి అవసరమైన ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.
ఎన్టీఆర్ జిల్లాలో నెలకొన్న తీవ్ర అనావృష్టి పరిస్థితులపై ప్రభుత్వం తక్షణమే సమగ్రంగా అంచనా వేయాలని కోరారు. జిల్లాలో వర్షపాతం పరిస్థితులను పరిశీలించి తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్న ప్రాంతాలను గుర్తించి తక్షణమే కరువు మండలాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కరువు పరిస్థితులతో రైతులతో పాటు వ్యవసాయ కూలీలు కూడా తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు.
వర్షాలు లోటుగా ఉండటంతో వ్యవసాయ పనులు తగ్గిపోయాయని, ఫలితంగా వ్యవసాయ కూలీలకు పనులు లేక కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా మారిందని అన్నారు. వ్యవసాయ పనులు లేని కూలీలకు జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద పెద్ద ఎత్తున పనులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పనుల్లో రోజుకు రూ.700 కూలి చెల్లించి వ్యవసాయ కూలీల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.
అంతేకాకుండా కరువు పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలోని వ్యవసాయ కూలీలకు కరువు భత్యం అందించాలని డిమాండ్ చేశారు. ప్రతి వ్యవసాయ కూలీ కుటుంబానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రూ.12 వేల ఆర్థిక సహాయం అందించాలని కోరారు. కరువు పరిస్థితుల్లో వ్యవసాయ కూలీల కుటుంబాలకు తక్షణ ఆర్థిక భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు.
చేతివృత్తిదారులు కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. చేతివృత్తిదారులకు ప్రభుత్వం బ్యాంకుల ద్వారా సబ్సిడీతో కూడిన ఆర్థిక రుణాలు అందించి వారి వృత్తులను కొనసాగించేందుకు సహకరించాలని డిమాండ్ చేశారు. రైతులు, చేతివృత్తిదారులు బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
కౌలు రైతుల సమస్యలను కూడా ప్రభుత్వం పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. జిల్లాలో కౌలు రైతులను గుర్తించి వారికి ప్రభుత్వం అందించే ఇన్‌పుట్ సబ్సిడీ, పంటల బీమా పరిహారం నేరుగా అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు మంజూరు చేసి భూ యజమానితో సంబంధం లేకుండా బ్యాంకుల ద్వారా పంట రుణాలు అందించాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు.
పేదలు సాగు చేసుకుంటున్న ప్రభుత్వ బంజరు భూముల సమస్యను కూడా పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. పేదల సాగులో ఉన్న ప్రభుత్వ బంజరు భూములను 22ఏ జాబితా నుంచి తొలగించి, ఆ భూములను సాగు చేసుకుంటున్న పేద రైతులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందించాలని కోరారు. వారికి రైతు భరోసా, పంటల బీమా, ఇన్‌పుట్ సబ్సిడీతో పాటు బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు కరువు పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని నాయకులు కోరారు. రైతులు, వ్యవసాయ కూలీలు, కౌలు రైతులు, చేతివృత్తిదారులు, పేద కుటుంబాలను ఆదుకునేలా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ తిరువూరు పట్టణ పార్టీ కార్యదర్శి మాలపాటి ఉదయ్, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని, రైతు సంఘం తిరువూరు నియోజకవర్గ కార్యదర్శి ఎన్. వనమాలి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పి. రవి, ఎం. పుల్లయ్య, బాణాల అశోక్, పల్లపు మురళి, అయినాల ముత్తయ్య, గురుబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.