ఊటుకూరు రామాలయంలో రాజ్యలక్ష్మి అమ్మవారికి అన్నపూర్ణాదేవి అలంకరణ
ఊటుకూరు రామాలయంలో రాజ్యలక్ష్మి అమ్మవారికి అన్నపూర్ణాదేవి అలంకరణ వైభవంగా చండీ హోమం.. పాల్గొన్న భక్తులు
ఎన్టీఆర్ జిల్లా, అక్టోబరు 13: తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం ఊటుకూరు గ్రామంలోని కోదండరామస్వామి దేవాలయంలో దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడోరోజైన మంగళవారం రాజ్యలక్ష్మి అమ్మవారిని అన్నపూర్ణాదేవి అలంకరణలో దర్శనమిచ్చేలా అలంకరించారు. ముందుగా ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు. అనంతరం మహాసరస్వతి, మహాకాళి, మహాలక్ష్మి స్వరూపిణి అయిన చండీమాతకు విశేష పూజలు నిర్వహించి, వేదమంత్రాల పారాయణం మధ్య చండీ హోమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొని పూజలు చేశారు. దసరా ఉత్సవాల్లో భక్తుల సహకారంతో ప్రతిరోజూ చండీ హోమం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు పి. సర్వేశ్వరరావు తెలిపారు.