ఎల్-నినో ప్రభావంతో కరువు నివారణకు గ్రామసభలు
- జల సంరక్షణ పనులపై ప్రజలకు అవగాహన.. సీబీజీ రామ్‌జీ పథకం ద్వారా నీటి నిల్వకు చర్యలు
యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట, అక్టోబర్ 31 (ఎన్ టుడే న్యూస్):
ఎల్-నినో ప్రభావంతో రానున్న రోజుల్లో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని, వాటిని ఎదుర్కొనేందుకు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రామన్నపేట మండలంలో గ్రామసభలు నిర్వహించారు.
మండలంలోని కక్కిరేణి, ఎన్నారం, కుంకుడుపాముల, సూరారం, తుర్కపల్లి గ్రామాల్లో నిర్వహించిన ఈ గ్రామసభల్లో రాబోయే రోజుల్లో నీటి కొరత తలెత్తకుండా చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై చర్చించారు. సీబీజీ రామ్‌జీ పథకం ద్వారా గ్రామాల్లో చేపట్టాల్సిన జల సంరక్షణ పనులు, నీటి వనరుల పరిరక్షణ, వర్షపు నీటిని ఒడిసిపట్టే విధానాలపై ప్రజలకు అధికారులు వివరించారు.
ఈ కార్యక్రమాల్లో ఎంపీడీఓ ఆవుల రాములు, వివిధ శాఖల అధికారులు, గ్రామ సర్పంచ్‌లు పాల్గొన్నారు. కక్కిరేణి సర్పంచ్ చిల్ల మధురవేణి సురేష్, ఎన్నారం సర్పంచ్ జనని, కుంకుడుపాముల సర్పంచ్ సత్తయ్య తదితరులు గ్రామసభల్లో పాల్గొన్నారు.