కార్మిక హక్కుల కోసం ఏఐటీయూసీ నిరంతరం పోరాటం--ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఇమ్రాన్
కార్మిక హక్కుల పరిరక్షణ కోసం ఏఐటియుసి నిరంతరం రాజిలేని పోరాటాలు చేస్తుందని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ అన్నారు.సోమవారం రోజున భువనగిరి పట్టణంలోని రాఘవేంద్ర కన్వెన్షన్ హాల్లో జరిగిన ఏఐటీయూసీ భువనగిరి మండల 5వ మహాసభకు ఇమ్రాన్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ కేంద్ర పాలకులు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబించడం వల్ల మారిన కార్మిక చట్టాల నేపథ్యంలో శ్రమ దోపిడీ పెరుగుతుందని అన్నారు. పాలక వర్గాలు కార్పొరేట్ శక్తులకు తొత్తుగా మారాయని, అనేక దశాబ్దాల పాటు పోరాడి సాధించుకున్న హక్కులు ఇప్పుడు కనుమరుగై మోడీ సర్కార్ కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయని ఆయన ఆరోపించారు. ఎన్డీఏ పాలనలో కార్మిక హక్కులు హరించబడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక చట్టాల సవరణ పేరుతో యాజమాన్యాల క్రింద కార్మికులు బానిసలుగా పనిచేయాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. మోడీకి కార్పొరేట్ల రక్షణ తప్ప కార్మిక సంక్షేమం తెలియదని ఆయన తెలిపారు. సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు తమ హక్కుల కోసం పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రపంచీకరణ, మతోన్మాదం, కార్మిక చట్టాల సవరణ ఇప్పుడు -అత్యంత వేగంగా ఈ ప్రభుత్వం అమలు చేస్తుందని దీనిని ప్రతిఘటించేందుకు సమరశీల పోరాటాలకు కార్మిక - వర్గం సిద్ధం కావాలన్నారు. 44 కార్మిక చట్టాలను సవరణ చేసి నాలుగు లేబర్ కోడ్ లుగా తీసుకు రావడం కార్మికులకు శాపంగా మారాయని అన్నారు. పాలకులు కార్మికులను కాదని యాజమాన్యాలకు వత్తాసు పలుకుతున్నాయని శ్రమకు తగిన వేతనం ఇప్పించడంలో విఫలమవుతున్నాయన్నారు.గతంలో కార్మిక చట్టాలు అత్యంత పదునుగా ఉండడంతో శ్రమకు తగిన రీతిలో కాకపోయినా కనీసం సగమైనా వేతనం లభించేదని ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. కార్మికుల సంక్షేమాన్ని చూడాల్సిన పాలకులు యాజమాన్యాల సంక్షేమాన్ని చూస్తున్నారని యాజమాన్యాలకు వేల కోట్ల రాయితీలు ప్రకటిస్తున్నా ప్రభుత్వాలు కార్మికుల గురించి ఆలోచించడం లేదన్నారు. పాలకులు ఆవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధాం కావాలని పిలుపునిచ్చారు. నిత్యవసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుంతుంటే అదుపు చేయడంలో పాలకులు విఫలమయ్యారని, ధరలు పెరగడం వల్ల కార్మికులు మధ్యతరగతి వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. గత ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం కార్మిక వర్గానికి ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటా లకు సిద్ధం కావాలని అన్నారు. పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు పెంచడం వలన పేద మధ్య తరగతి వర్గాలు తీవ్ర ఇబ్బందుకు ఎదుర్కొంటున్నారని అన్నారు. కనీస వేతనం ప్రతి కార్మికునికి రూ26,000 ఇవ్వాలని, ఆటో, హమాలి కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.సామల శోభన్ బాబు అధ్యక్షతన జరిగిన మహాసభలో ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి గనబోయిన వెంకటేష్, జిల్లా కమిటీ సభ్యులు సామల భాస్కర్, సిపిఐ పట్టణ కార్యదర్శి పుట్ట రమేష్, సహాయ కార్యదర్శి చింతల మల్లేష్, ఏఐటీయూసీ నాయకులు ముంతాజ్ బేగం, పల్లె శ్రీనివాస్,పిన్నం జగన్, గుర్రాల శ్రీనివాస్, మట్ట కుమార్,కొత్త కృష్ణ, దంతూరి జ్ఞానేశ్వర్,రాసాల భాస్కర్,ముదిగొండ బసవయ్య, కొలిపాక మల్లయ్య, పపాగళ్ల శంకరయ్య, గొరిగే శంకరయ్య, మంద బాబు, ఖలీల్, కిషన్ తదితరులు పాల్గొన్నారు.