కడప జిల్లాలో జాతీయ లోక్ అదాలత్‌కు సన్నాహాలు
రాజీ చేయదగిన కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు సమన్వయంతో పనిచేయాలి
కడప జిల్లా: ఈ నెల 12న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. రామగోపాల్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, అమరావతి ఆదేశాల మేరకు కడప జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్‌పై ముందస్తు సమావేశం నిర్వహించారు.
కడపలోని న్యాయ సేవా సదన్‌లో జరిగిన ఈ సమావేశానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, ప్రధాన జిల్లా న్యాయమూర్తి జి. రామగోపాల్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రొద్దుటూరు అదనపు ఎస్పీతో పాటు కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల డీఎస్పీలతో జాతీయ లోక్ అదాలత్‌లో రాజీ చేయదగిన కేసులపై చర్చించారు.
జాతీయ లోక్ అదాలత్ ద్వారా వీలైనంత ఎక్కువ సంఖ్యలో కేసులను రాజీ మార్గంలో పరిష్కరించేలా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని ప్రధాన జిల్లా న్యాయమూర్తి సూచించారు. పెండింగ్‌లో ఉన్న రాజీ చేయదగిన కేసులను గుర్తించి, ఇరుపక్షాల అంగీకారంతో త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
పెండింగ్ ట్రాఫిక్ చలానాలకు పరిష్కారం
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు W.P. No.116/2024, తేదీ 26-11-2025లో ఇచ్చిన ఆదేశాల మేరకు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలానాలను కూడా ఈ నెల 12న జరిగే జాతీయ లోక్ అదాలత్‌లో పరిష్కరించుకునే అవకాశం ఉందని సమావేశంలో వివరించారు.
సంబంధిత పరిధిలోని జాతీయ లోక్ అదాలత్ బెంచ్‌లో పెండింగ్ ట్రాఫిక్ చలానాలకు సంబంధించిన కేసులను నిబంధనల ప్రకారం పరిష్కరించుకునే విధంగా చర్యలు చేపట్టవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని సంబంధిత వాహనదారులు సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు.
జాతీయ లోక్ అదాలత్ ద్వారా రాజీ చేయదగిన కేసులు త్వరితగతిన పరిష్కారమయ్యేలా పోలీసు, న్యాయ శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ప్రధాన జిల్లా న్యాయమూర్తి స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎస్. బాబా ఫక్రుద్దీన్‌తో పాటు ఉమ్మడి కడప జిల్లాకు చెందిన అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.