పర్యావరణాన్ని కాపాడుదాం.. భవిష్యత్తును రక్షించుకుందాం
కుప్పం: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రాథమిక వైద్యశాల ఎన్.కొత్తపల్లి వైద్యాధికారి డాక్టర్ సుభాష్ రాజా అన్నారు. పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని వైద్య సిబ్బంది నిర్వహించారు.
డాక్టర్ సుభాష్ రాజా ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, స్టాఫ్ నర్సులు, సూపర్‌వైజర్, ఇతర సిబ్బంది కలిసి మొక్కలు నాటారు. అనంతరం పరిసరాల పరిశుభ్రత, మొక్కల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ప్రతి కుటుంబం కనీసం ఒక మొక్కను నాటి, దానిని బాధ్యతగా సంరక్షించాలని కార్యక్రమంలో సూచించారు. మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, ఇంటి పరిసరాలు, వీధులను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఏర్పరచుకోవచ్చని పేర్కొన్నారు.
పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని, ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.