మధిర: కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. షాద్‌నగర్ ఎమ్మెల్యేపై బీఆర్‌ఎస్ ఫిర్యాదు
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మరణాన్ని కోరుతూ, ఆయనకు హాని కలిగించేలా ప్రేరేపించే వ్యాఖ్యలు చేశారంటూ షాద్‌నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌పై మధిర టౌన్ పోలీస్ స్టేషన్‌లో బీఆర్‌ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు.
బుధవారం మధిరకు చెందిన బీఆర్‌ఎస్ నాయకులు పల్లపోతు వెంకటేశ్వరరావు, చిత్తారి నాగేశ్వరరావు, అరిగే శ్రీనివాసరావు, బొగ్గుల భాస్కర్‌రెడ్డి, చావా వేణు, వంకాయలపాటి నాగేశ్వరరావు, ఆళ్ల నాగబాబు, ప్యారి, చీధిరాల రాంబాబు, వేల్పుల శివ, వీర రాఘవరెడ్డి, బొగ్గుల వీరారెడ్డి తదితరులు మధిర టౌన్ సీఐ రమేష్‌ను కలిసి ఫిర్యాదు అందజేశారు.
ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన కేసీఆర్‌పై ఎమ్మెల్యే శంకర్ అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. బహిరంగంగా మరణాన్ని కోరే విధంగా వ్యాఖ్యలు చేయడం బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు.
ప్రజాప్రతినిధి హోదాలో ఉన్న ఎమ్మెల్యే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమాజంలో ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉందని పేర్కొన్నారు. కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకుని ఎమ్మెల్యే శంకర్‌పై తక్షణమే కేసు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు నిబంధనల ప్రకారం పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.