ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలి...
ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి కొలుసు పార్థసారథి
ఏలూరు/కలిదిండి, ఆగస్టు 8: కైకలూరు నియోజకవర్గం కలిదిండి మండలం కలిదిండి గ్రామంలో ఈ నెల 10న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి శనివారం ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలోని హెలిప్యాడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం సమీపంలోని ఖాళీ స్థలంలో ఏర్పాటు చేస్తున్న ప్రజావేదిక, వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ప్రక్కన ఏర్పాటు చేస్తున్న సభాస్థలి తదితర ప్రాంతాలను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్, ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్, బడేటి రాధాకృష్ణయ్య (చంటి), ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త పెందుర్తి వెంకటేశ్వరరావు, ముఖ్యమంత్రి భద్రతా అధికారులు, జిల్లా సంయుక్త కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ ఈ నెల 10న కలిదిండి మండలంలో ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమంలో భాగంగా రాజముద్రతో రూపొందించిన పట్టాదారు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారని తెలిపారు. ముఖ్యమంత్రి రాష్ట్రంలోని ఏ గ్రామంలో పర్యటించినా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు.
గత పాలకుల హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడి, వ్యవస్థలు దెబ్బతిన్నాయని విమర్శించారు. అందరి సంక్షేమం, అన్ని ప్రాంతాల అభివృద్ధి, సుపరిపాలన అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.
గత పాలనలో రెవెన్యూ శాఖలో చోటుచేసుకున్న అవకతవకల కారణంగా వ్యవస్థను పునరుద్ధరించేందుకు సమయం పట్టిందన్నారు. ప్రజల ఆస్తులకు భరోసా, జీవితాలకు విశ్వాసం కల్పించేందుకు రెవెన్యూ రికార్డులను ప్రక్షాళన చేస్తున్నామని తెలిపారు. 2019–24 మధ్య జరిగిన వ్యవహారాల కారణంగా పెద్ద ఎత్తున భూవివాదాలు తలెత్తాయని, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రజల నుంచి వచ్చిన అర్జీల్లో అత్యధికంగా భూ సమస్యలకు సంబంధించినవే ఉన్నాయని చెప్పారు.
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించి ప్రజలకు వారి భూమిపై సంపూర్ణ హక్కు కల్పించాలనే ఉద్దేశంతో ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన భూమి హక్కుల చట్టాన్ని రద్దు చేసి ప్రజలకు న్యాయం చేశామని పేర్కొన్నారు. భూమి రికార్డులకు సంబంధించిన వివరాల్లో అవసరమైన సవరణలు చేసుకునే అవకాశాన్ని సచివాలయాలతో పాటు స్వర్ణవార్డు, స్వర్ణ గ్రామ కార్యాలయాల్లో కూడా కల్పిస్తున్నట్లు తెలిపారు.
ముఖ్యమంత్రి అనుభవంతో రాష్ట్రం గాడిలోకి
ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలను చిన్నాభిన్నం చేసిందని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అపార అనుభవంతో తక్కువ సమయంలోనే రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నారని అన్నారు.
అమరావతి, పోలవరం, వివిధ నీటి ప్రాజెక్టులు, పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనకు ముఖ్యమంత్రి నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పట్టాదారు పాస్‌పుస్తకాలపై వ్యక్తిగత చిత్రాలు ముద్రించి సుమారు రూ.400 కోట్లు వృథా చేశారని ఆరోపించారు.
కైకలూరు నియోజకవర్గంలో 22(ఏ) కింద ఉన్న సుమారు 3,850 ఎకరాల భూములకు విముక్తి లభించిందని తెలిపారు. ఈ చర్యతో స్వాతంత్ర్య సమరయోధులు, రైతులు, ప్రజలు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. తమకు జరిగిన లబ్ధిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తెలియజేసేందుకు, ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు.