కార్యకర్తలకు అండగా ఎమ్మెల్యే. కొలికపూడి
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి 100 మంది కార్యకర్తలకు ప్లాటినా బైకులు అందజేత
కార్యకర్తలకు అండగా ఎమ్మెల్యే.. 100 మందికి ప్లాటినా బైకులు
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ప్రోత్సహించే కార్యక్రమానికి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు శ్రీకారం చుట్టారు. పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్న కార్యకర్తలకు తన సొంత నిధులతో 100 కొత్త ప్లాటినా బైకులు అందజేయాలని నిర్ణయించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా తొలి విడతగా గంపలగూడెం మండలానికి చెందిన ఐదుగురు కార్యకర్తలకు శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద కొలికపూడి శ్రీనివాసరావు స్వయంగా కొత్త ప్లాటినా బైకులను అందజేశారు.
పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం, ప్రజా సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడం, ప్రజలకు అందుబాటులో ఉండే కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేందుకు ఈ బైకులు ఉపయోగపడతాయని ఎమ్మెల్యే తెలిపారు.
తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలం, వెన్నెముక అనే నమ్మకంతో వారికి అవసరమైన సహకారం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న కార్యకర్తల సేవలను గుర్తించి ప్రోత్సహించడం తన బాధ్యతగా భావిస్తున్నానన్నారు. కార్యకర్తలకు, వారి కుటుంబాలకు అండగా ఉంటూ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.