నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలకు కాంగ్రెస్ అండ
నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలకు కాంగ్రెస్ అండ: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
బీఆర్ఎస్ ఆఫర్లకు లొంగలేదు.. అందుకే నేడు మంత్రిని అయ్యాను
జీవన్ రెడ్డి వైఖరిపై మరోమారు ధ్వజమెత్తిన మంత్రి
2029లోనూ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీయే
జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా దినేష్ ప్రమాణ స్వీకారం
జగిత్యాల ప్రతినిధి:
పార్టీ కోసం కష్టపడి, క్రమశిక్షణతో పనిచేసే ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా నియమితులైన సంగనభట్ల దినేష్ పదవీ ప్రమాణ స్వీకారోత్సవం, అభినందన సభ శనివారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి అడ్లూరి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ప్రలోభాలకు లొంగని నిబద్ధత
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తాను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని గుర్తు చేసుకున్నారు. "గెలిచినా, ఓడినా ప్రజల మధ్యే ఉన్నాను. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నాకు అనేక ఆఫర్లు ఇచ్చింది. కానీ ఏనాడూ ఆ ప్రలోభాలకు లొంగలేదు. పార్టీ జెండాను నమ్ముకుని పనిచేశాను కాబట్టే, నేడు కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించే అవకాశం దక్కింది" అని ఆయన పేర్కొన్నారు. కార్యకర్తలు ఎవరూ నిరాశ చెందవద్దని, సరైన సమయంలో అందరికీ గుర్తింపు లభిస్తుందని భరోసా ఇచ్చారు.
జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ధ్వజం
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి తీవ్రంగా స్పందించారు.
"రాష్ట్రంలో మార్పు రావాలని జీవన్ రెడ్డి నినాదం ఎత్తుకోవడం విచారకరం. ఎందుకు మార్పు రావాలి? నిరుపేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నందుకా? అర్హులకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నందుకా? లేక మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినందుకా?" అని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సంక్షేమ పాలన కొనసాగుతోందని, ప్రజల ఆశీస్సులతో 2029లో కూడా కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
గెలుపే లక్ష్యంగా ముందుకు..
ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని, రానున్న రోజుల్లో నిత్యం ప్రజల మధ్య ఉంటూ పార్టీని మరింత బలోపేతం చేస్తామని మంత్రి తెలిపారు. అనంతరం కొత్తగా బాధ్యతలు చేపట్టిన సంగనభట్ల దినేష్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
హాజరైన ప్రముఖులు:
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విఫ్ ఆది శ్రీనివాస్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణి, దుద్దిళ్ల శ్రీను బాబు, జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.