నకిరేకల్‌లో సీఎం సభ.. ట్రాఫిక్ ఆంక్షలు!
రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పోలీసుల ప్రత్యేక ఏర్పాట్లు
నకిరేకల్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. సీఎం సభకు భారీగా ప్రజలు తరలివచ్చే అవకాశం ఉండటంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను మళ్లించనున్నారు. నల్లగొండ, చిట్యాల, నార్కట్‌పల్లి, కట్టంగూర్, శాలిగౌరారం, కేతేపల్లి వైపు నుంచి సభకు వచ్చే ప్రజలు తిప్పర్తి సర్వీస్ రోడ్డు మీదుగా ఇందిరాగాంధీ సెంటర్ నుంచి మినీ స్టేడియం గ్రౌండ్‌కు చేరుకోవాలని పోలీసులు సూచించారు. సభా ప్రాంగణం వద్దకు బైక్‌లు, ఆటోలు, కార్లు, బస్సులు తీసుకురావద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. వాహనాలను పోలీసుల సూచించిన పార్కింగ్ ప్రదేశాల్లోనే నిలిపి, అక్కడి నుంచి సూచించిన మార్గాల్లో సభా ప్రాంగణానికి చేరుకోవాలని తెలిపారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ, భద్రత కోసం ముందస్తు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రజల భద్రత, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ మళ్లింపులు చేపడుతున్నామని పేర్కొన్నారు. ట్రాఫిక్ మళ్లింపులు, పార్కింగ్ ఏర్పాట్లు, పోలీసుల సూచనలకు ప్రజలు సహకరించాలని నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ విజ్ఞప్తి చేశారు.