ఓడలరేవు బీచ్‌లో విషాదం.. సముద్రంలో మునిగి ముగ్గురు యువకుల మృతి
ఓడలరేవు బీచ్‌లో విషాదం.. సముద్రంలో మునిగి ముగ్గురు యువకుల మృతి
అమలాపురం, జూలై 19: అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు బీచ్‌లో ఆదివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సముద్రంలో స్నానానికి దిగిన ముగ్గురు యువకులు అలల ఉద్ధృతికి చిక్కుకుని మునిగిపోవడంతో మృతి చెందారు.
మృతులను అంబాజీపేట మండలం మాచవరం గ్రామానికి చెందిన మంచాల శ్రీరామ్ (17), మంచాల సాయి, కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామానికి చెందిన సూదా అరవింద్ (23)గా పోలీసులు గుర్తించారు.
సముద్రంలో స్నానానికి దిగిన ముగ్గురు యువకులు ఒక్కసారిగా లోతైన ప్రాంతంలో అలల ఉద్ధృతికి చిక్కుకున్నట్లు సమాచారం. స్థానికులు వారిని రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న మెరైన్ పోలీసులు, స్థానిక పోలీసులు, మత్స్యకారులు, రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టాయి.
మొదట ఇద్దరి మృతదేహాలను గుర్తించిన అధికారులు, అనంతరం కొనసాగించిన గాలింపులో మూడో యువకుడి మృతదేహాన్ని కూడా వెలికితీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఘటనపై జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారికి అవసరమైన ప్రభుత్వ సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.
భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అన్ని బీచ్‌లలో ప్రమాదకర ప్రాంతాలను స్పష్టంగా గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని మంత్రి సూచించారు. మెరైన్ పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ప్రమాదకర ప్రాంతాల్లో ఎవరూ స్నానాలకు దిగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఓడలరేవు బీచ్‌కు ప్రతి వారం పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. సముద్రంలో బలమైన అలలు, లోతైన ప్రాంతాలు, రిప్ కరెంట్లు ఉండే అవకాశం ఉన్నందున భద్రతా సూచనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
ఈ ఘటనతో మాచవరం, చెయ్యేరు గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకేసారి ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబ సభ్యుల రోదనలు స్థానికులను కలచివేస్తున్నాయి.