పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థుల చేయూత
తాము చదువుకున్న పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు తమ వంతు సహకారం అందిస్తూ ఆదర్శంగా నిలిచారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని పేరేపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో 2008–2009 విద్యా సంవత్సరంలో 7వ తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు పాఠశాల అవసరాలను గుర్తించి సుమారు రూ.20 వేల విలువైన ఫర్నిచర్‌ను విరాళంగా అందజేశారు. పాఠశాల విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలనే సంకల్పంతో ముందుకొచ్చిన పూర్వ విద్యార్థులు కంప్యూటర్ టేబుల్, స్టీల్ బీరువా, 10 కుర్చీలను పాఠశాల యాజమాన్యానికి అందించారు. చిన్ననాటి బడిని మర్చిపోకుండా, తాము ఉన్నత స్థాయికి ఎదిగిన అనంతరం పాఠశాల అభివృద్ధికి సహకారం అందించడం అభినందనీయమని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, గ్రామస్తులు పేర్కొన్నారు. పూర్వ విద్యార్థుల చొరవ ఇతర బ్యాచ్‌ల విద్యార్థులకు సైతం స్ఫూర్తిదాయకమని పాఠశాల యాజమాన్యం తెలిపింది. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసి కృతజ్ఞతలు తెలిపారు.