పెనుగొలను: స్వాతంత్ర్య సమరయోధురాలు తల్లాప్రగడ విశ్వసుందరమ్మకు ఘన నివాళి
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు, రచయిత్రి తల్లాప్రగడ విశ్వసుందరమ్మ 77వ వర్ధంతి కార్యక్రమాన్ని శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో సాయిబాబా సేవా కమిటీ అధ్యక్షులు వూటుకూరు నారాయణరావు మాట్లాడుతూ తల్లాప్రగడ విశ్వసుందరమ్మ 1899 మార్చి 6న పశ్చిమగోదావరి జిల్లా భీమవరం తాలూకా ఉండి గ్రామంలో మల్లవరపు శ్రీరాములు, సీతమ్మ దంపతులకు జన్మించారని తెలిపారు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ఆమె కీలక పాత్ర పోషించారని, ముఖ్యంగా ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో చురుకుగా పాల్గొని జైలు శిక్ష అనుభవించారని పేర్కొన్నారు.
రాజమండ్రి గోదావరి తీరాన 1923లో "ఆనంద నికేతన ఆశ్రమం" స్థాపించి, అస్పృశ్యతా నివారణ, మహిళా అభ్యున్నతి, నూలు వడకడం, ఖాదీ నేయడం, అనాథలను ఆదరించడం వంటి కార్యక్రమాలను నిర్వహించారని తెలిపారు.
తల్లాప్రగడ విశ్వసుందరమ్మ 1920 నుంచి 1949 మధ్య కాలంలో 125 పద్యాలను రచించారని, ఆమె మరణానంతరం 1973లో సోదరులు "కవితా కదంబం" పేరుతో వాటిని సంపుటిగా ప్రచురించారని వివరించారు. "వైతాళికులు" సంకలనంలో కూడా ఆమె కవితలు చోటు చేసుకున్నాయని తెలిపారు.
స్వాతంత్ర్య సమరయోధురాలిగా, అభ్యుదయ భావాలు కలిగిన రచయిత్రిగా, మంచి వక్తగా విశేష గుర్తింపు పొందిన తల్లాప్రగడ విశ్వసుందరమ్మ 1949 ఆగస్టు 30న మరణించారని గుర్తు చేశారు. అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.