పెనుగొలనులో ఘనంగా జాతీయ వృద్ధుల దినోత్సవ వేడుకలు
9 మంది వృద్ధులకు ఘన సత్కారం.. పెద్దల గౌరవమే భారతీయ సంస్కృతి అని వెల్లడి
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం వద్ద శుక్రవారం జాతీయ వృద్ధుల దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో వివిధ రంగాలకు చెందిన తొమ్మిది మంది వృద్ధులను ఘనంగా సన్మానించారు.
లేళ్ల సంగమ్మ, లేళ్ల అచ్చయ్య, కురాకుల వెంకటేశ్వర్లు, రాళ్లచర్ల జగన్నాథం, తమ్మిశెట్టి చుక్కయ్య, లేళ్ల జానకి, కుంచం నరసింహారావు, గుమ్మ ఎర్రబ్బాయి, కుంచం వీరాస్వామిలకు నూతన వస్త్రాలు కప్పి, గోమాత జ్ఞాపికలను అందజేశారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో శిరిడి సాయిబాబా సేవా కమిటీ అధ్యక్షులు వూటుకూరు నారాయణరావు మాట్లాడుతూ భారతీయ సంప్రదాయంలో వృద్ధులకు ఎంతో ఉన్నతమైన స్థానం ఉందన్నారు. పెద్దలను గౌరవించి వారి అనుభవాలను, విలువైన సలహాలను స్వీకరించాలని సూచించారు.
రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాల్లో వృద్ధులు, గురువులు, తల్లిదండ్రులను గౌరవించడం అత్యంత ముఖ్యమైన ధర్మంగా పేర్కొన్నారని తెలిపారు. పెద్దల పట్ల విధేయత, సేవాభావమే మానవ జీవితానికి పునాది అని ఈ గ్రంథాలు చాటి చెబుతున్నాయని వివరించారు.
కార్యక్రమంలో భాగంగా సాయిబాబా సేవా కమిటీ సభ్యులు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాజవరం మాజీ సహకార సంఘ అధ్యక్షులు చెన్నపై అచ్చం రాజు, అయ్యప్ప స్వామి మందిర కమిటీ సభ్యులు మోటపోతుల ఆంజనేయులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.