పింఛన్ పరేషాన్
కొత్త సామాజిక పింఛన్ల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించడంతో రెండేళ్లుగా ఎదురుచూస్తున్న లక్షలాది మంది అభాగ్యుల్లో ఆశలు చిగురించాయి. అయితే కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం విధించిన నిబంధనలు వారిని కలవరపెడుతున్నాయి. నిబంధనలన్నీ దాటుకుని పింఛన్‌కు అర్హత సాధిస్తామా? లేదా? అన్న ఆందోళన దరఖాస్తుదారులను వెంటాడుతోంది. ఎలాంటి ఆధారం లేని సమాజంలోని కొన్ని వర్గాలు కనీస జీవనం సాగించేందుకు ప్రభుత్వాలు సామాజిక భద్రత పింఛన్లు అందిస్తున్నాయి. పెరుగుతున్న ధరలతో పోలిస్తే ప్రభుత్వం అందించే పింఛన్ సొమ్ము నామమాత్రమే అయినప్పటికీ, ఆ కొద్దిపాటి ఆసరా కోసం ఎదురుచూస్తున్న వారు లక్షల్లో ఉన్నారు.
ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ కూటమి తన మేనిఫెస్టోలో పింఛన్ సొమ్ము పెంచుతామని, అర్హులైన వారందరికీ పింఛన్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళల పింఛన్‌ను నెలకు రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచింది. వికలాంగులు, క్యాన్సర్, డయాలసిస్ తదితర తీవ్ర అనారోగ్య బాధితులకు కూడా పింఛన్ మొత్తాన్ని పెంచింది. దీంతో పింఛన్ పొందుతున్న లబ్ధిదారుల్లో ఆనందం వ్యక్తమైంది. అయితే కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకుని మూడో ఏడాదిలోకి ప్రవేశించినా కొత్త పింఛన్ల మంజూరులో మాత్రం ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించలేదు. కుటుంబంలో భర్త చనిపోయిన సందర్భాల్లో అర్హత ఉన్న భార్యలకు వితంతు పింఛన్లు కూడా పరిమిత సంఖ్యలోనే మంజూరయ్యాయి.
కొత్త పింఛన్ కోసం లక్షలాది మంది ఎదురుచూస్తున్నా ప్రభుత్వం ఇంతకాలం ఆ దిశగా పెద్దగా దృష్టి సారించకపోవడంతో ఆశావహుల్లో అసహనం, అసంతృప్తి పెరుగుతోంది. మరోవైపు నగదు బదిలీ పథకాల్లో వచ్చిన మార్పులు, పెరుగుతున్న నిత్యావసర ధరలు పేద కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నిబంధనల పేరుతో కొత్త పింఛన్లను మరింత ఆలస్యం చేస్తే ప్రజల నుంచి వ్యతిరేకత తప్పదన్న విషయాన్ని పాలకులు గుర్తించాలి.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి రాష్ట్రంలో అన్ని రకాల సామాజిక పింఛన్లు కలిపి 66 లక్షలకు పైగా ఉండగా, గత రెండేళ్లలో ఐదారు లక్షల వరకు పింఛన్లు తొలగించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కూడికలు, తీసివేతల అనంతరం ఈ సెప్టెంబరులో ప్రభుత్వం సుమారు 59 లక్షల మందికే పింఛన్లు పంపిణీ చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వేలు, పరిశీలనలతో ఇప్పటికే పింఛన్లు పొందుతున్న వారిలోనూ ఆందోళన నెలకొంది. ఊహించినట్లుగానే వివిధ కారణాలతో పెద్ద సంఖ్యలో పింఛన్లు రద్దయ్యాయి. ముఖ్యంగా సదరం ధ్రువీకరణ పేరుతో వికలాంగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తీవ్రంగా ఉన్నాయి.
కొత్త పింఛన్ల సంగతి అటుంచితే, ప్రస్తుతం ఉన్న పింఛన్లు కూడా ఎక్కడ తొలగిపోతాయోనన్న భయం లబ్ధిదారులను వెంటాడుతోంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 60 ఏళ్లు నిండిన అనేక మంది వృద్ధాప్య పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నా అవి ఎప్పుడు మంజూరవుతాయన్న విషయంలో స్పష్టత లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
గతంలో కొత్త పింఛన్ల కోసం ఆన్‌లైన్ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేది. అయితే ప్రస్తుతం ఆ విధానం అందుబాటులో లేకుండా పోయింది. దరఖాస్తుదారులు తమ ఆధార పత్రాలు, ఈ-కేవైసీ తదితర వివరాలతో కేవలం ఏడు రోజుల్లో స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. గతంలో గ్రామ సభలు, గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి పింఛన్ మంజూరు చేసే అధికారం మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మున్సిపల్ కమిషనర్లకు ఉండేది. ఇప్పుడు ప్రతి పింఛన్ రాష్ట్ర స్థాయిలోనే మంజూరు చేయనున్నట్లు ప్రభుత్వం చెబుతోంది.
అర్హత సాధించిన దరఖాస్తులను కూడా దశలవారీగా పంపిణీ చేస్తామని, బడ్జెట్, నిధుల లభ్యత ఆధారంగా చెల్లింపులు ఉంటాయని స్పష్టం చేసింది. దీన్నిబట్టి దరఖాస్తులు స్వీకరించిన వెంటనే పింఛన్లు మంజూరయ్యే పరిస్థితి లేదన్న విషయం స్పష్టమవుతోంది. పింఛన్ కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న వారికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కొత్త పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించడం రాజకీయంగా కూడా చర్చకు దారితీస్తోంది.
ప్రభుత్వం నిర్వహించిన ఐవీఆర్‌ఎస్ ప్రక్రియతో పాటు పలు అధ్యయనాలు, సర్వేల్లో కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వర్గాల్లో అసంతృప్తి అధికంగా ఉన్నట్లు గుర్తించినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రస్తుత దరఖాస్తుల స్వీకరణ ఆయా వర్గాల్లో నెలకొన్న అసంతృప్తిని తగ్గించే ప్రయత్నంగా భావించాల్సి వస్తోంది.
మరోవైపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 ఏళ్లకే రూ.4 వేల పింఛన్ ఇస్తామని తెలుగుదేశం పార్టీ కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. అయితే ఆ హామీ అమలు విషయంలో ఇప్పటికీ స్పష్టత లేకపోవడం ఆయా వర్గాల్లో నిరాశకు కారణమవుతోంది. సామాజిక భద్రత పింఛన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వాటా కూడా చాలా తక్కువగానే ఉంది. కేంద్రం నుంచి పింఛన్ పెంపు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది.
పింఛన్లు ఎవరికీ భిక్ష కాదు. సమాజంలో ఆర్థికంగా, సామాజికంగా అండలేని వారు గౌరవప్రదంగా జీవించేందుకు ప్రభుత్వం కల్పించే కనీస ఆర్థిక భద్రత. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నవారికి ఈ పింఛన్ ఒక జీవనాధారం. అందువల్ల పింఛన్లను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించకుండా, అర్హులైన ప్రతి ఒక్కరికీ పారదర్శకంగా, సకాలంలో అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పింఛన్లను ఎన్నికల హామీలుగానో, ఎన్నికల సమయంలో చేసే రాజకీయ ప్రకటనలుగానో కాకుండా సామాజిక బాధ్యతగా చూడాలి. అర్హులైన వారికి పింఛన్ అందించడంలో జాప్యం జరిగితే ప్రజల్లో అసంతృప్తి మరింత పెరిగే అవకాశం ఉంది.