పంటలను పరిశీలించిన వ్యవసాయ శాస్త్రవేత్తలు
పంటలను పరిశీలించిన వ్యవసాయ శాస్త్రవేత్తలు
నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని పలు గ్రామాల్లో కంపాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే), వ్యవసాయ పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలు, ఉద్యానశాఖ అధికారులతో కలిసి సోమవారం విస్తృతంగా క్షేత్ర సందర్శనలు నిర్వహించారు. వివిధ పంటలను పరిశీలించి చీడపీడలు, సూక్ష్మపోషకాల లోపాలను గుర్తించి రైతులకు నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. కంపాసాగర్ శాస్త్రవేత్తలు డాక్టర్ బి. అనిల్ కుమార్, డాక్టర్ వి. శ్రీధర్, ఉద్యాన శాస్త్రవేత్త టి. హిమబిందు, చిట్యాల క్లస్టర్ హెచ్‌ఓ శ్వేత, హెచ్‌ఈఓ రహీమ్, ఏఈఓ విజయలక్ష్మి ఈ క్షేత్ర సందర్శనలో పాల్గొన్నారు. ఔరవాణి గ్రామంలో పత్తి పంటను, బ్రాహ్మణవెల్లెంల గ్రామంలో పత్తి, వరి పంటలను శాస్త్రవేత్తలు పరిశీలించారు. పత్తి పంటలో మెగ్నీషియం లోపంతో పాటు పచ్చదోమ, ఇతర రసం పీల్చే పురుగుల ఉధృతిని గుర్తించారు. రైతులకు పంటల పరిస్థితికి అనుగుణంగా తగిన నివారణ చర్యలను వివరించారు.అదేవిధంగా చెర్వుగట్టు, యెల్లారెడ్డిగూడెం గ్రామాల్లో దొండ, బెండ, టమాటా, కాకర, మిరప తదితర ఉద్యాన పంటలను పరిశీలించారు. పంటల్లో కనిపిస్తున్న వివిధ సమస్యలు, చీడపీడలను గుర్తించి వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలను రైతులకు వివరించారు. వరి పంటలో అగ్గితెగులు నివారణకు ఎకరాకు ట్రైసైక్లజోల్ 120 గ్రాములు పిచికారీ చేయాలని సూచించారు. పత్తిలో మెగ్నీషియం లోపం నివారణకు లీటరు నీటికి 10 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ కలిపి పిచికారీ చేయాలని తెలిపారు. పచ్చదోమ నివారణకు ఎకరాకు ఫిప్రోనిల్ 400 మి.లీ లేదా ఎసిఫేట్ 300 గ్రాములు ఉపయోగించాలని సూచించారు. దొండ, కాకర పంటల్లో పండ్ల ఈగ నివారణకు ఎకరాకు 10 పండ్ల ఈగ ఎరలను ఏర్పాటు చేసుకోవాలని, అవసరమైతే ప్రోఫెనోఫాస్ 400 మి.లీ పిచికారీ చేయాలని సూచించారు. దొండ, మిరప పంటల్లో రసం పీల్చే పురుగుల నివారణకు ఫిప్రోనిల్, ఇమిడాక్లోప్రిడ్ లేదా థయామెథాక్సామ్ వంటి మందులను వ్యవసాయ శాఖ సూచించిన మోతాదుల్లో మాత్రమే వినియోగించాలని శాస్త్రవేత్తలు తెలిపారు. రైతులు తమ పంటలను క్రమం తప్పకుండా పరిశీలిస్తూ చీడపీడలు లేదా పోషక లోపాల లక్షణాలు కనిపించిన వెంటనే వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులను సంప్రదించాలని శాస్త్రవేత్తలు సూచించారు.