BREAKING
ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ..
Date of Publish : 01 September 2026, 04:50 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలి.. మైక్రో ఫైనాన్స్ వేధింపులు అరికట్టాలి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Sep, 2026 - 04:50 PM
53 వీక్షణలు

తల్లిదండ్రుల సమస్యలకు పిల్లల ప్రాణాలు బలికావద్దు.. మానవ హక్కుల కమిషన్ జోక్యం చేసుకోవాలి

న్యాయస్థానాలు సుమోటోగా కేసులు స్వీకరించి విచారించాలి: డి. హరినాథ్

ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వాలు శాశ్వత చర్యలు తీసుకోవాలని, పేద, మధ్యతరగతి కుటుంబాలను అప్పుల ఊబి నుంచి బయటపడేసేందుకు ప్రత్యేక విధానాలు అమలు చేయాలని సీపీఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డి. హరినాథ్ డిమాండ్ చేశారు. మైక్రో ఫైనాన్స్ సంస్థల వేధింపులను తక్షణమే అరికట్టాలని, రుణభారం కారణంగా తల్లిదండ్రులు తీసుకునే తీవ్ర నిర్ణయాలకు చిన్నారుల ప్రాణాలు బలికాకుండా మానవ హక్కుల కమిషన్ జోక్యం చేసుకోవాలని కోరారు. పిల్లల ప్రాణాల రక్షణ కోసం న్యాయస్థానాలు సైతం సుమోటోగా కేసులు స్వీకరించి విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక 2023 ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో ఏటా సుమారు 4 వేల నుంచి 4,500 వరకు ఆత్మహత్యలు జరుగుతున్నాయని డి. హరినాథ్ తెలిపారు. ఇందులో రైతులు, వ్యవసాయ కూలీలు 500 నుంచి 600 మంది వరకు ఉన్నారని పేర్కొన్నారు. అప్పులు, ఆర్థిక దివాలా కారణంగా కూడా 8 నుంచి 10 శాతం వరకు ఆత్మహత్యలు జరుగుతున్నాయని వివరించారు.

ఆర్థిక ఇబ్బందులు.. కుటుంబాలను కుంగదీస్తున్నాయి

అప్పులు, అవమానాలు, ఒంటరితనం, సమస్యలను ఇతరులతో పంచుకోలేకపోవడం వంటి కారణాలు ఆత్మహత్యలకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయని డి. హరినాథ్ పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పేద కుటుంబాలు ఆర్థిక సమస్యలతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నాయని అన్నారు.

దేశంలో అభివృద్ధి, విజన్ పేరుతో పాలకులు గొప్పలు చెబుతున్నప్పటికీ గ్రామీణ భారతంలో అనేక కుటుంబాలు అప్పులు, నిరుద్యోగం, వైద్యం, విద్య ఖర్చులతో సతమతమవుతున్నాయని విమర్శించారు. వినియోగదారీ సంస్కృతి పెరిగిపోవడం, ఆదాయానికి మించి ఖర్చులు చేయాల్సిన పరిస్థితులు రావడం వల్ల అనేక కుటుంబాలు అప్పుల పాలవుతున్నాయని తెలిపారు.

పిల్లల ప్రాణాలు బలికావడం బాధాకరం

తల్లిదండ్రుల ఆర్థిక సమస్యలు, రుణభారం కారణంగా చిన్నారుల ప్రాణాలు పోతున్న ఘటనలు అత్యంత బాధాకరమని డి. హరినాథ్ అన్నారు. తాము లేకపోతే పిల్లలు కష్టాలు పడతారనే తప్పుడు ఆలోచనతో కొందరు తల్లిదండ్రులు పిల్లలను చంపి తాము ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇలాంటి ఘటనలు పాషాణ హృదయులను సైతం కంటతడి పెట్టించేలా ఉన్నాయని తెలిపారు. పిల్లలు రేపటి భావి భారత పౌరులని, వారి జీవితాలను కాపాడాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

రాష్ట్రంలో జరిగిన విషాద ఘటనలు

విశాఖ నగరంలోని పెందుర్తి మండలం చింతల అగ్రహారంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రవీణ్ అనే ఆటో డ్రైవర్ భార్య అహల్య, చిన్నారులు హితిక్స, హన్విలకు విషమిచ్చి తాను ఉరివేసుకున్న ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చిందన్నారు.

నంద్యాల జిల్లాలో 2026 జనవరిలో వేములపాటి సురేంద్ర అనే దినసరి కూలీ ఆర్థిక ఇబ్బందులతో తన ముగ్గురు పిల్లలు కావ్య (7), ధ్యానేశ్వరి (4), సూర్య గగన్ (2)లకు పాలలో విషం కలిపి చంపిన ఘటన కూడా అత్యంత బాధాకరమని పేర్కొన్నారు.

పల్నాడు జిల్లా వినుకొండ ప్రాంతంలో కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలతో ఓ తల్లి తన ఇద్దరు చిన్నారులను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటనను గుర్తు చేశారు.

కాకినాడలో జరిగిన ఘటనలో ప్రభుత్వ రంగ సంస్థలో అకౌంటెంట్‌గా పనిచేసిన వ్యక్తి తన ఇద్దరు కుమారులు జోషిత్ (7), నిఖిల్ (6)లను చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. అభద్రతాభావం, మానసిక ఒత్తిడి ఇలాంటి ఘటనలకు కారణాలుగా మారుతున్నాయని అన్నారు.

శ్రీ సత్యసాయి జిల్లాలో బత్తలపల్లి గ్రామంలో కుటుంబ కలహాలు, అనుమానాల కారణంగా ఓ మహిళ తన ఇద్దరు పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన కూడా సమాజాన్ని కలచివేసిందన్నారు.

పిల్లలను హత్య చేసి తాము ఆత్మహత్య చేసుకునే ఘటనలను "ఫిలిసైడ్ సూసైడ్" అంటారని తెలిపారు. ఇలాంటి పరిస్థితులు రాకుండా పిల్లల మానసిక ఎదుగుదలకు కుటుంబ సభ్యులు సహకరించాలని కోరారు.

పిల్లలకు మానసిక ధైర్యం కల్పించాలి

పిల్లలకు తమ అభిప్రాయాలు చెప్పుకునే స్వేచ్ఛ ఇవ్వాలని, ఇంట్లో జరిగే సమస్యలను స్నేహితులతో, నమ్మకమైన వ్యక్తులతో పంచుకునేలా ప్రోత్సహించాలని డి. హరినాథ్ సూచించారు.

సమస్యల్లో ఉన్న పిల్లలు, కుటుంబ సభ్యులు 104, 108 సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. ఆప్తమిత్ర 1800-599-0019 వంటి సహాయ నంబర్లపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని కోరారు.

ఇంట్లో తరచూ గొడవలు, ఏడుపులు, ఆర్థిక సమస్యలు కనిపిస్తే చుట్టుపక్కల వారు "ఏమైంది?" అని ఆప్యాయంగా అడిగి ధైర్యం చెప్పాలని సూచించారు. ఒక్కరి ఆత్మీయ పలకరింపు కూడా ఒకరి జీవితాన్ని కాపాడగలదని తెలిపారు.

ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కాదు

అప్పులు తీర్చలేకపోతే చట్టపరమైన మార్గాలు ఉన్నాయని, ఆస్తి పోయినా తిరిగి సంపాదించుకునే అవకాశం ఉంటుందని డి. హరినాథ్ అన్నారు. కానీ ప్రాణాలు కోల్పోతే తిరిగి పొందలేమని చెప్పారు.

కుటుంబ పెద్ద చనిపోతే ఆ కుటుంబం పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని, పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ధైర్యంగా జీవించాలని సూచించారు. బంధువులు, స్నేహితులు ఇలాంటి కుటుంబాలకు అండగా నిలవాలని కోరారు.

మైక్రో ఫైనాన్స్ వేధింపులు ఆపాలి

రైతులు, కౌలు రైతులు పంట నష్టాలు, అధిక వడ్డీ అప్పులు, పిల్లల చదువులు, విదేశీ విద్య ఖర్చుల కోసం ప్రైవేట్ మైక్రో ఫైనాన్స్ సంస్థలపై ఆధారపడుతున్నారని తెలిపారు.

బ్యాంకుల నుంచి సకాలంలో రుణాలు అందకపోవడం వల్ల ప్రజలు మైక్రో ఫైనాన్స్ సంస్థలను ఆశ్రయిస్తున్నారని, అధిక వడ్డీల కారణంగా అప్పులు పెరిగిపోతున్నాయని అన్నారు.

వారానికి ఒకసారి వసూళ్ల కోసం ఇళ్లకు వచ్చి కుటుంబ సభ్యుల ముందు అవమానించడం, గొడవలు చేయడం వల్ల ప్రజలు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారని ఆరోపించారు.

ఉదయం 9 గంటల లోపు, రాత్రి 6 గంటల తర్వాత మైక్రో ఫైనాన్స్ సంస్థలు వసూళ్ల పేరుతో వేధింపులకు పాల్పడకూడదని తెలిపారు. ఇంటి ముందు అవమానించడం, బెదిరించడం వంటి చర్యలు చట్టవిరుద్ధమని పేర్కొన్నారు.

ఇలాంటి వేధింపులు ఎదురైతే మండల న్యాయ సేవా సంస్థలు, మహిళా సంఘాలు, గ్రామస్థాయి సంఘాల ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు.

ప్రజా ఉద్యమాల ద్వారా పోరాటం

మైక్రో ఫైనాన్స్ వేధింపులకు వ్యతిరేకంగా, ప్రజలను రుణ విముక్తులను చేసేందుకు ప్రజా పోరాటాలు కొనసాగిస్తామని డి. హరినాథ్ తెలిపారు.

బ్యాంకుల ద్వారా హామీ లేని సూక్ష్మ రుణాలు అందించాలని, విద్య, వైద్యం ఉచితంగా అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు.

బాలలపై వేధింపులు, కుటుంబ విషాదాలను అరికట్టేందుకు మానవ హక్కుల కమిషన్, న్యాయస్థానాలు ప్రత్యేక దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.