స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ..
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. బీసీలకు 50 శాతం సీట్లు: బోడె రామచంద్రయాదవ్
విజయవాడ: రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భారత చైతన్య యువజన పార్టీ (బీసీవై) రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడె రామచంద్రయాదవ్ ప్రకటించారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 50 శాతం సీట్లు కేటాయిస్తామని, ఇప్పటివరకు చట్టసభలకు ప్రాతినిధ్యం వహించని అణగారిన బీసీ కులాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.
మిగిలిన 50 శాతం స్థానాల్లో కాపులతో పాటు దశాబ్దాలుగా అణచివేతకు గురవుతున్న ఇతర వర్గాలకు ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పారు. సోమవారం విజయవాడలోని బీసీవై పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
సంచార జాతుల హక్కుల కోసం పోరాటం
ఆగస్టు 31న జాతీయ సంచార, అర్ధ సంచార జాతుల విముక్తి దినోత్సవం సందర్భంగా 56 సంచార జాతులకు బోడె రామచంద్రయాదవ్ శుభాకాంక్షలు తెలిపారు. బ్రిటిష్ పాలనలో క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ ద్వారా సంచార జాతులు అణచివేతకు గురయ్యాయని, 1952 ఆగస్టు 31న వారికి విముక్తి లభించిందని పేర్కొన్నారు.
స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచినా సంచార జాతులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబాటుతనాన్ని ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. సంచార జాతుల అభివృద్ధి, హక్కుల సాధన కోసం బీసీవై పార్టీ కట్టుబడి ఉంటుందని తెలిపారు.
ఓటర్ల జాబితాపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బీసీవై
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని బోడె రామచంద్రయాదవ్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి జూలై 1, 2026 నాటి ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నికలకు వెళ్తామని చెబుతూ, రాష్ట్రంలో మాత్రం జనవరి 1, 2026 నాటి జాబితా ఆధారంగా ఎన్నికలు నిర్వహించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.
సర్ ప్రక్రియ ద్వారా ఓటర్ల జాబితాలో మార్పులు జరుగుతున్నాయని పేర్కొంటూ, జూలై 1, 2026 నాటి ఓటర్ల జాబితా ఆధారంగానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వంపై విమర్శలు
బీసీ రిజర్వేషన్ల విషయంలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం, ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తున్నాయని బోడె రామచంద్రయాదవ్ విమర్శించారు. గతంలో బీసీల రిజర్వేషన్లను తగ్గించారని ఆరోపించిన ఆయన, ప్రస్తుత ప్రభుత్వం 34 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెబుతున్నప్పటికీ, దీనిపై స్పష్టత అవసరమన్నారు.
బీసీలకు 44 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌తో తమ పార్టీ గతంలో ‘బీసీ సింహగర్జన’, ‘బీసీ ధర్మదీక్ష’ కార్యక్రమాలు నిర్వహించిందని తెలిపారు. సాంకేతిక, న్యాయపరమైన అంశాలను సాకుగా చూపి బీసీలకు అన్యాయం చేయవద్దని ప్రభుత్వాన్ని కోరారు.
బీసీలకు 44 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని, రిజర్వేషన్ల విషయంలో అన్యాయం జరిగితే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి అక్రమాలు, అవకతవకలు జరిగినా బీసీవై పార్టీ ప్రజల తరఫున పోరాడుతుందని బోడె రామచంద్రయాదవ్ స్పష్టం చేశారు.