ద్రావిడ విశ్వవిద్యాలయ 29వ వార్షికోత్సవంవిశ్వవిద్యాలయం, కుప్పంలో 29వ వార్షికోత్సవం
ద్రావిడ విశ్వవిద్యాలయ 29వ వార్షికోత్సవం
ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పంలో 29వ వార్షికోత్సవం 18 ఏప్రిల్ 2026న మధ్యాహ్నం 2.30 గంటలకు ఎం. ఎస్. సుబ్బులక్ష్మి ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ గౌరవనీయ ఉపకులపతి ప్రొఫెసర్ ఎల్. సి. మల్లయ్య గారు అధ్యక్షత వహించి, ద్రావిడ విశ్వవిద్యాలయ 29వ వార్షికోత్సవం విద్యార్థులకు అంకితమైన ప్రత్యేకమైన రోజు అని తెలిపారు. విద్యార్థులు తమ ప్రతిభను ప్రపంచానికి చూపించాలన్నారు. మనం సాధించాలంటే ఏమి సాధించాలి, దాన్ని సాధించడానికి ఈ విశ్వవిద్యాలయంలో ఉన్న సౌకర్యాలను వినియోగించుకుని తమ ప్రతిభను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. పోటీ ప్రపంచంలో విజయవంతంగా జీవించాలంటే విద్య పూర్తి చేసి మంచి జ్ఞానంతో బయటి ప్రపంచంలో ఉద్యోగాలు సాధించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి సంవత్సరం ఈ వార్షికోత్సవాన్ని ఇదే విధంగా ఘనంగా నిర్వహించాలని అన్నారు. ద్రావిడ విశ్వవిద్యాలయాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు అధ్యాపకులు మరియు సిబ్బంది అందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమం నిర్వహణకు సహకరించిన సమన్వయకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఇక్కడ పనిచేస్తున్న అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు మరియు విద్యార్థులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
National Samajika Samarasata (Forum for Social Equality) సమన్వయకర్త శ్రీ కాసిబొట్ల శ్యామ్ ప్రసాద్ జీ ముఖ్య అతిథిగా హాజరై, 1980లలో కుప్పాన్ని సందర్శించినట్లు తెలిపారు. ఇక్కడ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు కలిసే ప్రాంతమని పేర్కొన్నారు. ఇక్కడ చదువుకోవడం ఒకటి, నిజ జీవితంలో జీవించడం మరొకటి అని, ఇక్కడ చదివి బయటకు వెళ్లినప్పుడు జీవితం భిన్నంగా అనిపిస్తుందని విద్యార్థులకు తెలియజేశారు. థామస్ ఆల్వా ఎడిసన్ విద్యుత్ బల్బును కనిపెట్టే సమయంలో మూడు వేల సార్లు ప్రయత్నించి విజయం సాధించినట్లు ఉదాహరణగా చెప్పారు. విద్యార్థులు కూడా జీవితంలో కష్టపడి ముందుకు సాగాలని సూచించారు. సైన్యంలో పనిచేసిన అన్నా హజారే గారు ఒక సందర్భంలో ఆత్మహత్యకు ప్రయత్నించి, రైల్వే పట్టాలపైకి వెళ్లినప్పుడు రైలు రాకపోవడంతో పక్కనే ఉన్న గ్రంథాలయంలో స్వామి వివేకానంద పుస్తకాన్ని చదివి జీవిత సత్యాన్ని గ్రహించి తన నిర్ణయాన్ని మార్చుకుని మహారాష్ట్రలో ఆదర్శ గ్రామాన్ని నిర్మించినట్లు వివరించారు. అదే విధంగా ద్రావిడ విశ్వవిద్యాలయం నుండి విద్య పూర్తి చేసి బయటకు వెళ్లే విద్యార్థులు జీవితంలో విజయం సాధించాలని ఆకాంక్షించారు.
ద్రావిడ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ (ఇన్‌చార్జ్) ప్రొఫెసర్ వి. కిరణ్ కుమార్ గారు గౌరవ అతిథిగా పాల్గొని, ఇక్కడ డిగ్రీ మరియు పీజీ విద్య పూర్తి చేస్తున్న విద్యార్థులకు అభినందనలు తెలిపారు. విశ్వవిద్యాలయంలో అన్ని వ్యవస్థలు ఆటోమేషన్ పద్ధతిలో అమలు అవుతున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన సమన్వయకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అకాడమిక్ అఫైర్స్ అధికారి ప్రొఫెసర్ కె. శ్యామల గారు వార్షిక నివేదికను సమర్పిస్తూ, ద్రావిడ విశ్వవిద్యాలయంలో మొత్తం 298 పుస్తకాలు ప్రచురించబడినట్లు తెలిపారు. ఈ పుస్తకాలు తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం మరియు ఆంగ్ల భాషల్లో వెలువడినట్లు చెప్పారు. రుసా (RUSA) నిధి ద్వారా ఎన్.టి.ఆర్. కాంప్లెక్స్ నిర్మాణం పూర్తయ్యిందని, కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు పూర్తయిందని, ఇంజినీరింగ్ కాలేజ్ ప్రారంభించబడిందని, ఈ సంవత్సరం పరిశోధనలు మరియు విద్యార్థుల చేరికలు పెరిగినట్లు వివరించారు. అలాగే ఎన్.టి.ఆర్. యు.జి. క్యాంపస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎస్. విజయవర్థిని గారు మాట్లాడుతూ ఎన్.టి.ఆర్. కాంప్లెక్స్‌లో డిగ్రీ కోర్సులు నిర్వహించబడుతున్నాయని, ఎక్కువమంది విద్యార్థులు అక్కడ చదువుతున్నారని వివరించారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగాధిపతి డాక్టర్ వి. మెర్సీ జ్యోతి గారు మాట్లాడుతూ టెన్నిస్, కబడ్డీ, లాంగ్ జంప్ వంటి క్రీడల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం జాతీయ స్థాయిలో పాల్గొన్నట్లు తెలిపారు.
ఈ వార్షికోత్సవంలో విశ్వవిద్యాలయ ఆచార్యులు, సిబ్బంది, పరిశోధకులు మరియు సాధారణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
— డా.పి. ఎస్. గణేష్ మూర్తి
ప్రజాసంబంధాల అధికారి
ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం.