వర్ధన్నపేటలో కొండచిలువల సంచారం.. ప్రజల్లో కలకలం
వరంగల్ జిల్లా, వర్ధన్నపేట: వర్ధన్నపేట మండలంలో కొండచిలువల సంచారం స్థానికంగా కలకలం రేపుతోంది. శనివారం దమ్మన్నపేట నుంచి బండౌతపురం వెళ్లే రహదారిపై ఐదు అడుగులకు పైగా పొడవున్న కొండచిలువ కనిపించింది.
పొలాల నుంచి రహదారిని దాటుతున్న కొండచిలువను గమనించిన వాహనదారులు ఫొటోలు, వీడియోలు తీసినట్లు సమాచారం. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇటీవల ఉప్పరపల్లి క్రాస్‌రోడ్డు సమీపంలోని జాతీయ రహదారిపై కూడా కొండచిలువ కనిపించినట్లు స్థానికులు తెలిపారు. వరుసగా కొండచిలువలు కనిపిస్తుండటంతో రహదారులపై, పొలాల పరిసరాల్లో ప్రయాణించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
కొండచిలువలు కనిపించినప్పుడు వాటిని దగ్గరగా వెళ్లి ఫొటోలు, వీడియోలు తీయకుండా, వాటిని రెచ్చగొట్టకుండా సంబంధిత అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని సూచిస్తున్నారు.