శుక్రవారం భారత్ రానున్న పుతిన్
Ntoday News / నేషనల్ బ్యూరో:
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రేపు (శుక్ర వారం) భారత్ రానున్నారు. బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం కోసం ఆయన వస్తున్నారు. సెప్టెంబరు 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలోని భారత మండపంలో ఈ సదస్సు జరుగుతుంది. అంతకుముందే మోడీతో పుతిన్ కీలక భేటీలో పాల్గొంటారని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఈ సమావేశంలో డిఫెన్స్ సహకారం పైనే ఇరు దేశాధినేతలు ప్రధానంగా చర్చిస్తారని తెలుస్తోంది. ముఖ్యంగా ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, రష్యా తయారు చేసిన ఐదో తరం సు-57 ఫైటర్ జెట్, బ్రహ్మోస్ మిసైల్స్ అప్గ్రేడ్ చేయడంపై మోడీ, పుతిన్ చర్చించనున్నట్లు సమాచారం. మిలిటరీ, టెక్నికల్ సహకారంపై ఈ భేటీలో ప్రధానంగా ఫోకస్ పెట్టనున్నట్లు రష్యా అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోప్ తెలియజేశారు. కొంతకాలంగా తమ ఐదో తరం సు-57 ఫైటర్ జెట్లను భారత్కు అమ్మడంతోపాటు, వాటి టెక్నాలజీని కూడా పూర్తిగా భారత్కు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు రష్యా పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారత్ కూడా ఐదో తరం ఫైటర్ జెట్స్ కోసం ప్రయత్నాలు చేస్తోంది. అలాగే ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత రక్షణలో కీలక పాత్ర పోషించిన ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను కూడా అదనంగా కొనుగోలు చేసేందుకు భారత్ సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. స్వయంగా పుతిన్ వచ్చి రక్షణ చర్చలు జరపనున్న నేపథ్యంలో.. బ్రిక్స్ సమావేశం కన్నా ఈ భేటీపై అంతర్జాతీయంగా ఫోకస్ పెరిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఎస్-400 డెలివరీలపై చర్చ..!
రష్యాతో ఐదు ఎస్-400 ట్రయంఫ్ సిస్టంల కోసం 2018లోనే 5.43 బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని భారత్ చేసుకుంది. వీటిలో మూ డింటిని రష్యా ఇప్పటికే డెలివరీ చేయగా.. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా మిగతా రెండింటి డెలివరీ ఆలస్యమైంది. వీటిని ఈ ఏడాదిలోనే అందిస్తామని రష్యా చెస్తోంది. ఇక వ్యూహాత్మకంగా మరింత కీలకమైన అంశం సు-57 ఫైటర్ జెట్స్ అని చెప్పొచ్చు. ఈ జెట్స్ను భారత్కు అమ్మే అంశం పుతిన్ ఎజెండాలో ప్రధానంగా ఉందని పెస్కోవ్ తెలిపారు. భారత వాయుసేన తమ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ సంఖ్యను బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న వేళ.. ఈ ఐదో తరం ఫైటర్ జెట్ ఎయిర్ఫోర్స్కు అందితే ఐఏఎఫ్క(IAF) అనూహ్య బలం చేకూరనుంది. భారత్ మాత్రం కేవలం జెట్స్ కొనడం కంటే వాటి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసుకొని, స్థానికంగానే సు-57 జెట్స్ను తయారు చేయాలని ఆలోచిస్తోంది. భారత సైంటిస్టులు ఈ వివరాలు అడుగుతున్నట్లు పెస్కోవ్ కూడా ధ్రువీకరించారు. వీటితోపాటు భారత సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ 'బ్రహ్మోస్'ను అప్గ్రేడ్ చేసే అంశంపై కూడా పుతిన్, మోడీ భేటీలో చర్చ జరగనున్నట్లు పెస్కోవ్ వెల్లడించారు.