సుప్రసిద్ధ శాస్త్రవేత్త పల్లె రామారావు కన్నుమూత పలు సంస్థల నివాళులు
హైదరాబాద్ అక్టోబర్ 04/ఎన్ టుడే న్యూస్.
భారత దేశ అత్యుత్తమ శాస్త్రవేత్తల్లో ఒకరు, మెటలర్జీ విభాగం, అణు భౌతిక శాస్త్రం లోను విశేష కృషి చేసి అంతర్జాతీయ ఖ్యాతి గడించిన విఖ్యాత శాస్త్రవేత్త, పద్మ విభూషణ్ ప్రొఫెసర్ పల్లె రామారావు (89) కన్నుమూసారు.
1937, జూన్ 30 న కర్నూలులో జన్మించిన రామారావు ప్రాధమిక విద్య మునిసిపల్ హైస్కూలులో తెలుగు మాధ్యమంలో ముగించి ఉన్నత చదువులు బెంగళూరు, మద్రాసు, ఆంధ్ర, బెనారస్ విశ్వవిద్యాలయాల్లో కొనసాగించి పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో మెటీరియల్ సైన్స్ లో పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ నిర్వహించారు.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (బెంగళూరు), బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలలో ఆచార్యునిగా బోధించిన పిమ్మట హైదరాబాదు లోని డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ లాబొరేటరీ (డిఎంఆర్ఎల్) డైరెక్టర్ గా, కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ కార్యదర్శిగా, ఓషన్ డెవలప్మెంట్ కార్యదర్శిగా, అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు (ఏఈఆర్ బీ) చైర్మన్ గా, హెచ్ సీయూ వైస్ ఛాన్సలర్ గా, ఏఆర్ సీఐ చైర్మన్ గా, డిఆర్ డిఓ, ఇస్రో డిస్టింగ్విష్డ్ సైంటిస్ట్, ప్రొఫెసర్ మొదలైన అనేక హోదాల్లో పనిచేశారు.
భారత దేశపు అత్యంత విశిష్ట శాస్త్రవేత్త, సైన్స్ పాలసీ సలహాదారు, అకాడమిక్ అడ్మినిస్ట్రేటర్లలో ఒకరైన డాక్టర్ రామారావు మృతికి సీసీజీజీఓఓ జాతీయ చైర్మన్ వి. కృష్ణ మోహన్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. రామారావు స్వదేశీ సాంకేతిక నైపుణ్యంతో ఆర్డినెన్సు కర్మాగారం హెవీ అల్లోయ్ పెనిట్రేటర్ ప్లాంట్, తిరుచునాపల్లి ప్రారంభంలోనూ, ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్ (ఏఆర్ సిఐ), హైదరాబాద్, నాన్ -ఫెర్రస్ మెటీరియల్ టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ (ఎన్ఎఫ్ టీడీసీ), హైదరాబాద్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ, చెన్నై, సేఫ్టీ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్, కల్పక్కం, టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డు (టిడిబి), ఢిల్లీ మొదలైన సంస్థలను నెలకొల్పి వాటి అభివృద్ధికి పాటుబడ్డారని వి. కృష్ణ మోహన్ కొనియాడారు.
ప్రముఖ శాస్త్రవేత్త, విద్యావేత్త, పరిపాలనాదక్షుడైన రామారావు మరణంతో జన విజ్ఞాన వేదిక మార్గదర్శకుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. సుప్రసిద్ధ శాస్త్రవేత్త రామారావు మరణం విద్యా, శాస్త్ర, సాంకేతిక రంగాలకు తీరని లోటని ఆలిండియా పీపుల్స్ సైన్స్ నెట్వర్క్ (ఏఐపీఎస్ఎన్) శ్రద్ధాంజలి ఘటించింది.
హైదరాబాద్ విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతికి నివాళులర్పిస్తూ అసాధారణ శాస్త్రవేత్త, దూరదృష్టి కలిగిన నాయకుడు, ఆప్తుడైన గురువు యొక్క మార్గదర్శక వెలుగును కోల్పోయామని, విజ్ఞాన శాస్త్రం, పరిశోధన, దేశ సేవ రంగాలకు రామారావు అందించిన సేవలు చిరస్మరణీయంగా నిలిచి పోతాయని పొగిడారు.
జాతీయ, అంతర్జాతీయంగా పలువురు ప్రముఖులు శ్రద్ధాంజలి ఘటించారు.