మూసిలో పెరుగుతున్న వరద : దిగువ ప్రాంతాలకు అధికారుల హెచ్చరిక
NTODAY NEWS : సూర్యాపేట/నల్గొండ
ఎగువ పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో మూసీ రిజర్వాయర్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా, ప్రస్తుతం 640.58 అడుగుల నీటిమట్టం నమోదైంది. 4.46 టీఎంసీల పూర్తి నిల్వ సామర్థ్యానికి గాను ప్రస్తుతం 3.35 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. గత 24 గంటల్లో రిజర్వాయర్‌కు 1,150 క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైందని, రానున్న సమయంలో ఈ ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా అవసరమైన సమయంలో రిజర్వాయర్ గేట్లను తెరిచే అవకాశం ఉన్నందున దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నదిలోకి ఎవరూ వెళ్లవద్దని, నది పరిసర ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు హెచ్చరించారు. అధికారుల సూచనలు, భద్రతా మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.
మూసి రిజర్వాయర్ గేట్లు తెరవడం వల్ల సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట, పెన్‌పహాడ్, పాలకీడు మండలాలు, అలాగే రత్నాపురం, రామవరం, హనుమాన్ తండ, వెంకట్రాంపూర్ టేకుమట్ల, నంద్యాలగూడెం తదితర 20 గ్రామాలు ప్రభావిత ప్రాంతాలుగా పేర్కొన్నారు. నల్గొండ జిల్లాలో కేతేపల్లి, మాడుగులపల్లి, మిర్యాలగూడ మండలాలతో పాటు బొప్పారం, కాసనాగోడ్, చికటిగూడెం, కొత్తపేట, ఉప్పలపహాడ్, కొప్పోలు, భీమారం, ఆమనగల్, వాడపల్లి, వజీరాబాద్ తదితర 21 గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదల శాఖ నం.1, సూర్యాపేట కార్యనిర్వహణ అధికారి సూచించారు.