వచ్చే ఏడాది స్వదేశీ బుల్లెట్ రైలు అందుబాటులోకి: అశ్విని వైష్ణవ్
మే లేదా జూన్ నాటికి తొలి స్వదేశీ బుల్లెట్ రైలు పట్టాలెక్కే అవకాశం
న్యూఢిల్లీ | Ntoday News
భారత్‌లో తయారు చేస్తున్న తొలి స్వదేశీ బుల్లెట్ రైలు వచ్చే ఏడాది మే లేదా జూన్ నాటికి పట్టాలెక్కే అవకాశం ఉందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేస్తున్న ఈ రైలును తొలుత పరీక్షా దశలో నడిపించనున్నట్లు పేర్కొన్నారు.
2027 నాటికి సూరత్–బిలిమోరా మధ్య ప్రయాణికుల సేవలు ప్రారంభించే లక్ష్యంతో పనులు కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు. ఈ మార్గం ముంబై–అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ ప్రాజెక్టులో భాగంగా ఉంది.
ఇదే సమయంలో దేశవ్యాప్తంగా రైల్వే మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు చేపడుతున్నట్లు అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. రైల్వే వ్యవస్థలో 36 వేల కిలోమీటర్ల మేర కొత్త ట్రాక్‌ల నిర్మాణం, సుమారు 280 రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ వంటి పనులకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.
స్వదేశీ సాంకేతికతతో బుల్లెట్ రైలు అభివృద్ధి చేయడం ద్వారా దేశీయ రైల్వే తయారీ సామర్థ్యానికి మరింత ఊతం లభిస్తుందని కేంద్రం భావిస్తోంది.