బలమైన 6G నెట్‌వర్క్ కోసం 24 దేశాలతో భారత్ భాగస్వామ్యం
గ్లోబల్ 6G ప్రమాణాల్లో కనీసం 10 శాతం వాటా లక్ష్యం
న్యూఢిల్లీ | Ntoday News
ప్రపంచంలో అత్యంత బలమైన 6G నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేసేందుకు భారత్ మరో 24 అభివృద్ధి చెందిన దేశాలతో కలిసి పనిచేయనున్నట్లు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయన ‘ఎక్స్’ వేదికగా తెలిపారు.
గ్లోబల్ 6G ప్రమాణాల రూపకల్పనలో భారత్ కీలక పాత్ర పోషించడంతో పాటు, కనీసం 10 శాతం వాటాను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. 6G సాంకేతికత అభివృద్ధి, ప్రమాణాల రూపకల్పనలో అంతర్జాతీయ సహకారాన్ని మరింత బలోపేతం చేయనున్నట్లు పేర్కొన్నారు.
G20 ఇన్నోవేషన్ వేదికపై భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించిన మంత్రి జితిన్‌కు జ్యోతిరాదిత్య సింధియా ధన్యవాదాలు తెలిపారు. 6G సాంకేతికతపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు, అభివృద్ధి వేగం పుంజుకుంటున్న నేపథ్యంలో భారత్ కూడా ఈ రంగంలో తన సామర్థ్యాన్ని పెంచుకుంటోంది.
2030 నాటికి 6G సాంకేతికత పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు. 5G తర్వాత మరింత వేగవంతమైన, తక్కువ లేటెన్సీతో కూడిన కనెక్టివిటీని అందించడమే 6G లక్ష్యంగా ఉండనుంది.