పుట్టుకతో గుండె జబ్బులతో బాధపడుతున్న 19 మంది చిన్నారులకు విజయవంతంగా శస్త్రచికిత్సలు
హైదరాబాద్: పుట్టుకతోనే గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న 19 మంది చిన్నారులకు విజయవంతంగా శస్త్రచికిత్సలు నిర్వహించిన నిమ్స్ వైద్య బృందాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అభినందించారు.
నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో ఈ నెల 6 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించిన చిన్నారుల గుండె శస్త్రచికిత్సల శిబిరం విజయవంతంగా పూర్తయింది. ఈ సందర్భంగా వైద్యులు డాక్టర్ డి. రమణ ధన్నపునేని, డాక్టర్ ఎం. అమరేష్ రావు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
శిబిరంలో మొత్తం 19 మంది చిన్నారులకు గుండె శస్త్రచికిత్సలు నిర్వహించారు. వీరిలో కేవలం రెండు కిలోల బరువున్న రెండు నెలల పసికందుకు కూడా విజయవంతంగా శస్త్రచికిత్స చేయడం పట్ల ముఖ్యమంత్రి వైద్య బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. అత్యంత తక్కువ బరువున్న శిశువుకు సైతం క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించడం వైద్య బృందం నైపుణ్యానికి నిదర్శనమని ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి, జగిత్యాల శాసనసభ్యుడు డాక్టర్ ఎం. సంజయ్ కుమార్ పాల్గొన్నారు.